చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
Congress:వర్గపోరుకు నిలయమైన కాంగ్రెస్ నేతలు గొడవపడ్డారు.. కొట్టుకున్నారు.. మామూలుగా కాదు.. చెప్పులు, పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కొండా మురళి వర్గీయులు, నూతన జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. జిల్లా కేంద్రంలోని అబ్నస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియమించారు.జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణ.. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఇంటికి వెళ్లి కలువలేదని, ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వారిని ఆహ్వానించలేదని కొండా వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది.
బుధవారం ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంంలో రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఓ నేత వేదికపైకి వెళ్లే సమయంలో ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేదికపైకి వెళ్లే ఓ నేతను కులం పేరుతో ప్రత్యర్ది వర్గానికి చెందిన మరొకరు దూషించడంతో ఘర్షణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు.పిడిగుద్దులు కురిపించారు.