టీ కప్పులో తుఫానే…
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు కొత్త పార్టీ లేదు - ఫలించిన దూతల రాయబారం - రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి - కొత్త కమిటీల రద్దుకు అంగీకారం - అయినా కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపించని ఉత్సాహం - ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆందోళన
మంచిర్యాల – నాకు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదు. అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నం… మూడు రోజల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 10న కొత్త పార్టీ పెడతాం.. ఇదీ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు హెచ్చరిక. నాలుగు రోజుల కిందట ఆయన ఈ హెచ్చరిక జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. అయితే అది టీ కప్పులో తుఫానే అని తేలిపోయింది.
అందుకే లీకులు ఇచ్చారా..?
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు నాలుగు రోజుల కిందట కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఇక్కడి నేతలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన వర్గాన్ని కాదని ఆదిలాబాద్‌లో కొత్త కమిటీలు వేస్తున్నారని ఇది సమంజసం కాదని స్పష్టం చేశారు. తన కార్యకర్తలకు అన్యాయం జరుగుతందని వాపోయారు. ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేస్తే కనీసం తన పేరు కూడా సభపై చెప్పలేదని అలకబూనారు. తాను పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ స్థాయిలో చెబితే తప్ప అధిష్టానం దిగిరాదని భావించిన ఆయన కొత్త పార్టీ వ్యవహారం బయటకు తెచ్చారని చెబుతున్నారు.
కార్యకర్తల భుజాలపై తుపాకి పెట్టి..
నిజానికి ఇందులో ప్రేంసాగర్ రావు అసలు వ్యూహం వేరే ఉందని పలువురు చెబుతున్నారు. ఆయన తనకు పదవులు కావాలని అడిగారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవులు కావాలని అడిగారు. అదే సమయంలో తన వారికి కొందరికి సైతం పదవులు డిమాండ్ చేశారు. వాటి విషయంలో అధిష్టానం మౌనం వహించడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. అదే సమయంలో ఆరు ఎమ్మెల్యే టిక్కెట్లు సైతం ఇవ్వాలని పట్టుబట్టడం సరైన స్పందన లేకపోవడం ఇలా రకరకాల కారణాలతో ప్రేంసాగర్ రావు అలకబూనారు. తాను బెట్టు చేస్తే ఇటు తనకు పదవులతో పాటు కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా ఉంటాడనే పేరు కూడా సంపాదించవచ్చని వ్యూహం పన్నారు. ఇప్పుడు ఆయన అనుకున్న విధంగానే ఆయనకు పదవితో పాటు కొత్త కమిటీలు రద్దు చేస్తామన్న హామీ లభించింది.
కార్యకర్తల్లో కనిపించని ఉత్సాహం..
అయితే ఈ విషయంలో కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ప్రేంసాగర్ రావు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని విపరీతమైన ప్రచారం జరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సతమతం అవుతున్నారు. ఆయన సడన్‌గా పార్టీ మారినా, కొత్త పార్టీ పెట్టినా ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న తమ సంగతి ఏమిటనే అయోమయంలో పడ్డారు. ఆయనకు పదవి ఇస్తామని చెప్పగానే సైలెంట్ అయ్యారని ఒకవేళ రాకపోతే ఆయన పరిస్థితి తద్వారా తమ పరిస్థితి ఏమిటని డైలామాలో పడ్డారు. ఈ మధ్య కాలంలో చాలా మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వారంతా ఒక రకంగా ఆందోళనకు గురవుతున్నారు.
అందరూ శత్రువులే..
ప్రేంసాగర్ రావుకు పదవి వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదనేది కార్యకర్తలే చెబుతున్నారు. ఆయనకు పార్టీలో ఉన్న చాలా మంది నేతలు శత్రువులుగా ఉన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన నేత మహేశ్వర్ రెడ్డి, క్రమశిక్షణ సంఘం సభ్యుడుగా పదవి అందుకున్న గడ్డం వినోద్‌కు ఆయనకు గిట్టదు. అన్ని రకాలుగా సొంత జిల్లాలోనే నేతలకు ఆయనకు పడదు. మరి వీరందని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారా..? అంటే అనుమానమే అని చెబుతున్నారు. టిక్కెట్టు వచ్చినా ఆయనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే సిద్ధంగా ఉంటారనేది కాదనలేని సత్యం. ఎందుకంటే ఆయనే స్వయంగా సొంత పార్టీ నేతలను ఓడించారు. అరవిందరెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఆయనకు ఓటేయవద్దని తన శ్రేణులకు చెప్పారు. 2014 ఉప ఎన్నికల్లో ఇంద్రకరణ్‌రెడ్డి కాగజ్‌నగర్ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కాంగ్రెస్‌కు తప్ప ఎవరికైనా ఓటేయమని తన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో చంద్రశేఖర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ప్రేంసాగర్ రావు తనకు సహకరించలేదని టీఆర్ ఎస్ పార్టీకి సహకరించారని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఆయన చేసిన పనులు ఆయనకే బూమరాంగ్లాగా తగిలే అవకాశం ఉందని చెబుతున్నారు.
అసంతృప్తిలో కాంగ్రెస్ శ్రేణులు..
ఇక తమ నేత చేసే తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే నచ్చడం లేదు. పార్టీ కోసం కష్టపడ్డవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారికి కాకుండా బయట వారికి అవకాశం ఇస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులుగా వేరే పార్టీ నుంచి వచ్చిన వారినే ప్రకటించారు. లక్ష్సెట్టిపేట పట్టణ అధ్యక్షుడిగా టీఆర్ ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికే ఇచ్చారు. ఇలా ఆయనే స్వయంగా తప్పులు చేస్తున్నారని తాము ఎన్నో ఏండ్లుగా పార్టీని పట్టుకుని ఉంటే తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం ప్రస్తుతానికి సద్దుమణిగింది. అది మళ్లీ ఎప్పుడైనా రాజుకుంటుందా..? కద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఆగ్రహం చల్లారింది. కొత్త పార్టీ కథ కంచికి చేరింది.