భద్రకాళి చెరువుకు గండి
Bhadrakali pond: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో వరంగల్ నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతననగర్ వైపు కట్ట కోతకు గురైంది. దీంతో పోతననగర్, సరస్వతి నగర్, భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు హుటాహుటిన చెరుకుని భద్రకాళి చెరువు కింద ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. గండి పడిన ప్రాంతంలో ఉన్న కాలనీల వాసులు ఇళ్లు ఖాళీ చేయాలని పేర్కొన్నారు. పోతన నగర్ వైపు వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.
అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రకాళి చెరువు నుంచి వస్తున్న నీటిని దారి మళ్లించి.. దిగువ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో దిగువ ప్రాంత కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే గండి పూడ్చేందుకు సిబ్బందిని తరలించారు.