40 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన ఉపాధ్యాయుడు
Payam Meeniah:భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అతలాకుతలం అయ్యింది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. అందులోనూ ములుగు జిల్లా అయితే.. చిగురుటాకులా వణికిపోయింది. జంపన్న వాగు ఉప్పొంగటంతో చాలా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. చాలా మంది నిరాశ్రయిలయ్యారు. కొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ పరిస్థితిలోనే ఓ ఉపాధ్యాయుడి ముందు చూపు 40 మంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది.
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఊర్లకు ఊర్లే మునిగిపోయాయి. కొంత మంది ప్రాణాలు కాపాడకుంటే, మరికొంత మంది బలయ్యారు. ఓ గురుకుల ఉపాధ్యాయుని సమయస్ఫూర్తితో ఏకంగా 40 మంది విద్యార్థులు ప్రాణాలతో దక్కారు. నాలుగు రోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో ములుగు జిల్లా మొత్తం అతలాకుతలం అయ్యింది. జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగింది. మేడారం, కొండాయి గ్రామం మొత్తం జలదిగ్బందమైంది.
ఏటూరు నాగారం మండలం కొండాయిలో గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పాయం మీనయ్య వరద ప్రమాదాన్ని ముందే గ్రహించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కేవలం తాను మాత్రమే వెళ్లిపోకుండా.. తనతో పాటు 40 మంది విద్యార్థులను కూడా తన ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థులందరికీ తన ఇంటి దగ్గరే వసతి కల్పించి.. భోజనం పెట్టారు. ఆయన వాళ్లను తీసుకువెళ్లడం ఆ తర్వాత పాఠశాల వరదల్లో నీట మునిగింది. ఒకవేళ తను తీసుకువెళ్లి ఉండకపోతే విద్యార్థులు అందరూ వరదల్లో కొట్టుకుపోయేవారు. ఆయన సమయస్ఫూర్తికి అందరూ అభినందిస్తున్నారు.
విషయాన్ని తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ట్విట్టర్ ద్వారా ఉపాధ్యాయుడు మీనయ్యను అభినందించారు. జిల్లా కలెక్టర్ కు పిల్లల బాగోగులు చూడాలని ఆదేశించారు. ఇలాంటి వాళ్లు ఉండడం తమకు గర్వ కారణంగా ఉందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ ట్వీట్‌ను చూసిన మంత్రి కేటీఆర్.. రీ ట్వీట్ చేస్తూ.. చాలా గొప్ప పని చేశారంటూ మీనయ్యను ప్రశంసించారు.