ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌లు ఆపండి..

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు శనివారం మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంపై హీరో నాగార్జున ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై విచారించిన జస్టిస్ టి.వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ఎన్ కన్వెన్షన్ హాల్‌ను హైడ్రా భారీ బందోబస్తు మధ్య శనివారం ఉదయం కూల్చివేసింది. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు అందడంతో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. కాగా, హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన కన్వెన్షన్‌ సెంటర్స్‌లో N కన్వెన్షన్ ఒకటి. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఈ నెల 21న లేఖ రాశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా N కన్వెన్షన్‌కు వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. కూల్చివేతకు ముందే యజమానికి హైడ్రా నోటీసులు పంపించింది.

అంతకు ముందు ఈ కూల్చివేతపై నాగార్జున స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమ‌న్నారు. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని నాగార్జున పేర్కొన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like