నేను ఇంట్లోనే బైబిల్ చదువుతా..
Ys Jagan: నేను నాలుగు గోడల మధ్యే బైబిల్ చదువుతా.. బయటకు వెళ్తే హిందూ. ఇస్లాం, సిక్కు మతాలను అనుసరిస్తా.. నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో ఏం రాసుకుంటారో రాసుకోండని.. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో మొదటిసారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తన తిరుమల పర్యటన అడ్డుకునేందుకు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని, ఇతర రాష్ట్రాల నుంచి సైతం బీజేపీ నేతల్ని పిలిపించారని జగన్ ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. అందుకే వ్యవహరాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. లడ్డూ తయారీ కోసం తక్కువగా కోట్ చేసిన వారికే టెండర్లు ఇస్తారని, ఇందులో ఎక్కడా తప్పు జరిగే అవకాశం ఉండదన్నారు. నెయ్యి కొనుగోలు ఆరు నెలలకోసారి రొటీన్ గా జరిగే కార్యక్రమమని, దీనిపై ఏ నిర్ణయమైనా టీటీడీ బోర్డు సభ్యులంతా కలిసే తీసుకుంటారన్నారు. అయినా ప్రసాదం కల్తీ అయిందని, దాన్ని భక్తులు తిన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రే దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలోనూ నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను 15 సార్లు వెనక్కి పంపారని జగన్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామన్నారు.
జూలై 23న టీటీడీ ఈవో వెజిటబుల్ ఫ్యాట్స్ నెయ్యిలో కలిశాయని, వాటిని వాడలేదని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. రెండు నెలల తర్వాత చంద్రబాబు జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి స్ధాయిలో అబద్దాలు చెప్పారని మరో వీడియో ప్రదర్శించారు. ఆ తర్వాత ఈవో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ ఇదే విషయం చెప్పారని జగన్ తెలిపారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడారని చెప్పిన వీడియోను కూడా జగన్ ప్రదర్శించారు. అన్నీ తెలిసి చంద్రబాబు అబద్ధాలు ఆడారని, లడ్డూపై తప్పుడు ప్రచారం చేసారని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి ప్రసాదం పుచ్చుకునే భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారని విమర్శించారు. తన రాజకీయ స్వార్ధం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారన్నారు.
జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు. ఇలాంటివే రోజుకో అబద్ధం ప్రచారం చేస్తున్నారన్నారు. నందినీ బ్రాండ్ పైనా మరో అబద్ధం ప్రచారం చేశారన్నారు. 2015-19 మధ్య నందినీ బ్రాండ్ ఎందుకు వాడలేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. రూ.320కే నెయ్యి ఎలా వస్తుందని అడుగుతున్నారని, గత చంద్రబాబు హయాంలో రూ.276 నుంచి రూ.324 కే కొన్నారని గుర్తుచేశారు.