గ్రీన్ హైడ్రోజన్ చిరునామాగా తెలంగాణ
రానున్న కాలంలో థర్మల్ విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున, తెలంగాణలో ఇప్పటి నుండే పెద్దఎత్తున సోలార్ ప్లాంట్లను, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జపాన్లో యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తరహా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను తెలంగాణలో ఏర్పాటు చేయటానికి ఇంధనశాఖ సన్నాహాలు ప్రారంభించాలని కోరారు. ఇక్కడ నీటి వసతి, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు విస్తారంగా ఉన్నందున రాష్ట్రమంతట గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. తద్వారా దేశంలో గ్రీన్ హైడ్రోజన్ కు చిరునామాగా తెలంగాణ నిలవాలన్నారు. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రీన్ హైడ్రోజన్ ఇక్కడ గల ఎరువుల కర్మాగారాలకు, ఆర్టీసీకి, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయవచ్చని తద్వారా పర్యావరణహిత చర్యలకు ఎంతో దోహదం చేసిన వారమవుతామని పేర్కొన్నారు.
సోలార్ ప్లాంట్లలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బిఇఎస్ఎస్)
యమానాషీ పరిశోధన అభివృద్ధి సంస్థ రూపొందిస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బిఇఎస్ఎస్) బ్యాటరీల తయారీ విభాగాన్ని కూడా విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నుండి పగటిపూట ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో మిగులు విద్యుత్ దాచడానికి ఈ బ్యాటరీలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అటువంటి అవకాశం పూర్తిస్థాయిలో అందుబాటులో లేనందున, సోలార్ విద్యుత్ ఉపయోగించని సమయంలో పూర్తిస్థాయిలో మిగులు విద్యుత్ వృథా అవుతోంది. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు, త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యమానాషీ అధికారులతో మాట్లాడుతూ తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం సాంకేతికత వినియోగంపై ఉమ్మడి భాగస్వామ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు కలిసి రావాలని కోరారు.
సోలార్ విద్యుత్ ను వినియోగిస్తూ నీటిని ఎలక్ట్రోలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ విధంగా ఉత్పత్తి అయిన హైడ్రోజన్ రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్గా, ఫ్యాక్టరీలలో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేదిగా వినియోగిస్తున్నారని నిర్వాహక ఇంజినీర్ కునిగి వివరించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి విక్రమార్కతో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ బలరామ్ పాల్గొన్నారు.