శ్రీ‌వారి మెట్ల మార్గం మూసివేత

Thirumala:శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని గురువారం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భక్తులు ఇబ్బందులు పడకుండా గురువారం శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ ప్రణాళికపై ఈవో శ్యామ‌ల‌రావు అధికారులతో చర్చించి సూచనలు చేశారు. భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొండచరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాల‌ని, ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కోసం డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నామార్గాలు ఏర్పాటు చేయాల‌న్నారు.

వైద్యశాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎస్వీబీసీ, సోషియల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like