క‌న‌బ‌డుట లేదు

-ఆ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలెక్కడ...?
-అధికార పార్టీలోనే ఉన్నా క‌న‌బ‌డ‌ని వైనం
-వాళ్లెక్కడున్నారో..? ఏం చేస్తున్నారో..? తెలియ‌ని ప‌రిస్థితి
-క్యాడర్ కు సైతం అందుబాటులో లేని దుస్థితి

Those leaders are not visible: పదేళ్ల పాటు ద‌ర్జాగా అధికారం చ‌లాయించారు… బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే కండువా మార్చేశారు… మ‌ళ్లీ త‌మ‌దే హ‌వా అని భావించారు.. కాంగ్రెస్ లో చేరి అధికారం చ‌లాయించాల‌నుకున్నారు. కానీ, వారు ఒక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి త‌ల‌చిన‌ట్లుగా ఇప్పుడు జాడా ప‌త్తా లేకుండా పోయారు. అధికార పార్టీలో చేరినా, వారంతా క‌నిపించ‌డం లేదు. అధికారం కోసం ఆరాటపడ్డ వారంతా ఇప్పుడు తెర మీదకు రావ‌డం లేదు. ఎంపీ ఎన్నికల ఫలితాల ద‌గ్గ‌ర నుంచి వారంతా క‌నీసం క్యాడ‌ర్‌కు సైతం అందుబాట‌లో లేకుండా పోయారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో హస్తంపార్టీలో చేరిన ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజకియంగా కనుమరుగ‌వుతున్నారు…? ఇంతకీ ఆ నేతలెవ‌రు…? వారి భవిష్యత్ ఏంటీ….? నాంది న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టించింది. పదిస్థానాల్లో 9 స్థానాలు కైవ‌సం చేసుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో పదిస్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో మాత్ర‌మే గెలిచింది. ఓటమి పాలైన మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరుకోనప్ప, విఠల్ రెడ్డి కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోడవంతో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేఖానాయక్, రాథోడ్ బాపురావ్ సైతం హ‌స్తం గూటికి చేరారు. ఇలా బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలగా పనిచేసిన ఆ ఐదుగురు ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నా క్షేత్ర స్థాయిలో వాళ్లు కనిపించడం లేదు. కొంతమంది అయితే తమ ప్రధాన అనుచరులకు సైతం అందుబాటులో లేకుండా పోయారు. మరి కొంతమంది ఎక్కడున్నారో సైతం తెలియని స్థితి.

నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. విఠల్ రెడ్డి అదే పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కోనేరు కోనప్ప సిర్పూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా అదే పార్టీ నుంచి గెలుపొందారు. ఇక రేఖానాయక్, రాథోడ్ బాపురావ్ మరోసారి టికెట్ రాకపోవడంతో ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి త‌మ ప్ర‌భావం చూపించి అధిష్టానం వ‌ద్ద మార్కులు కొట్టేయాల‌ని భావించారు. మ‌ళ్లీ ఏదైనా ప‌ద‌వి సాధించుకుని ఎమ్మెల్యే స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని భావించారు. కానీ, వారు అనుకున్న‌ది ఒక‌టి.. అయ్యింది ఇంకోటి అన్న‌ట్లుగా త‌యార‌య్యింది ప‌రిస్థితి. వాళ్లు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్ప‌డం మాట దేముడెరుగు.. కానీ వారు ఎక్క‌డా పార్టీ కార్య‌క్ర‌మాల్లో కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో కానీ క‌నిపించ‌డం లేదు.

వారంతా కనిపించకుండా పోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటాలని భావించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను వరుస బెట్టి చేర్పించుకుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌ల‌ను ఎక్క‌డిక్క‌డ కండువా క‌ప్పేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లీడర్లు కొంద‌రు నేత‌ల‌ను వద్దని ఆందోళనలు చేసినా పార్టీ మాత్రం సీనియారిటీ, రాజకీయ అనుభవం, జనంలో ఇమేజ్ ఉందని భావించి పార్టీలోకి తీసుకున్నారు. నిర్మ‌ల్‌లో మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని చేర్పించుకోవ‌ద్ద‌ని కాంగ్రెస్ నేత‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. ఇలా చాలా చోట్ల జ‌రిగాయి. కానీ, అధిష్టానం ఎంపీ స్థానం గెలిచేందుకు వారందిరినీ పార్టీలోకి తీసుకుంది. అయితే, ఎంపీ ఎన్నికల ఫలితాల్లో వారి ప్రభావం పెద్దగా కనిపించకపోవగా గెలవాల్సిన కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ సీటు ఓటమి పాల‌య్యింది. సొంతపార్టీ నేతలు, పక్కపార్టీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, అలాగే గతంలో పార్టీ కోసం పని చేసిన వారంతా ఉన్నా బీజేపీ అభ్యర్థి గెలుపును ఆపలేకపోయారు.

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యేలందరికి ఎంపీ ఎన్నికల పని తీరుకు గీటురాయి అని భావించినా చేరిన చోటల్లా పార్టీకి ప్లస్ కంటే మైనస్ అయిందనే వాదన ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం సైతం అదే స్పష్టం చేస్తోంది. ముథోల్, నిర్మల్, సిర్పూర్ , ఖానాపూర్, బోథ్ లలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. పైగా బీజేపీ ఒక్క నిర్మల్ జిల్లాలోనే భారీగా మెజార్టీ సాధించింది. దీంతో వచ్చిన నేతల ప్రజాబలం ఏంటో అర్థం చేసుకోవచ్చని సొంత పార్టీలోనే గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఎంపీ ఎన్నికల్లో ప్రభావం చూపించడంతో పాటు త‌మ‌ చరిష్మాతో ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలిపిస్తే ఆపార్టీలో రాజకీయ భవిష్యత్ ఉంటుందని అంద‌రూ లెక్క‌లు వేసుకున్నారు. మంచిపేరు సంపాదించడమే కాకుండా వారికి తగ్గ నామినేటెడ్ పదవులు సైతం ఇస్తుందని ఆశించారు. హస్తం పార్టీ సైతం కొంతమంది పైన భారీ అంచనాలు వేసుకుంది. కానీ సీన్ రివర్స్ కావడం తో సదరు నేతలంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు.

ఆ నేత‌లు మంత్రుల పర్యటనలైనా, పార్టీ కార్యక్రమాలైన ఎక్కడా కనిపించడం లేదు. కొంతమంది పట్టణాలకు పరిమితం అయితే మరి కొంతమంది ఎక్కడున్నారో సైతం తెలియని పరిస్థితులు. అటు పార్టీ సైతం వీరి గురించి పెద్దగా పట్టించుకోవ‌డం లేదనే వాద‌న వినిపిస్తోంది. దీంతో వారు సైతం పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్ నచోట ఎమ్మెల్యే పెత్తనం ఉండగా, ఎమ్మెల్యే గెల‌వ‌ని చోట నియోజకవర్గ ఇంచార్జీల పెత్తనం సాగిస్తున్నారు. దీంతో వారికి పని లేకుండా పోయింది. పైగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి అనే పేరు తప్ప ఎలాంటి ప్రొటోకాల్ లేదు. దీంతో కార్య‌క్ర‌మాల‌కు ఎలా హాజ‌రు కావాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో వారు సైలెంట్ అయ్యార‌నే వాద‌న కూడా ఉంది. వీరి గురించి పట్టించుకునే వారు కాని, వారి కోసం ఏదో ఒక ప‌ద‌వి కావాల‌ని కోరుకునే వారు లేక‌పోవ‌డంతో వారంతా మౌనముద్రలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

పార్టీలో ప్రాముఖ్య‌త ఇవ్వడం లేదు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏమైనా దూసుకపోదామంటే వారు పెద్దగా వారు చేసేది కూడా ఏం క‌నిపించ‌డం లేదు. పార్టీలో సైతం వారికో ప్రత్యేకత ఏమైనా ఉందంటే అదీ లేదు. ఇలాంటి సమయంలో ఏదో చేసి ఇంకేదో అయ్యే కంటే మౌనం వహించడమే మేలనుకుని నేత‌లంతా మౌనంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. ఇదంతా చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు రాజకీయం అంటేనే అలా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా, ఒకప్పుడు హంగూ, ఆర్భాటం హడావుడిగా ఉండే నేతలు అసలు రాజకీయాల్లో కనిపించకుండా పోతుండం చర్చీనీయాంశంగా మారుతోంది. మ‌రీ ఆ నేత‌లు కాంగ్రెస్ లో ఏదైనా పార్టీ ప‌ద‌వులు సాధించి ముందుకు సాగుతారా..? లేక ఇంకేదైనా ఆలోచ‌న చేస్తారా..? చూడాలి మ‌రి..

Get real time updates directly on you device, subscribe now.

You might also like