ఆరోపణలు మానండి.. అభివృద్దికి సహకరించండి…
Mancherial: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao)పై అసత్య ఆరోపణలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావుకు కాంగ్రెస్ నేతలు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలువురు నేతలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రఘునాథ్ రావు ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలకు స్వస్తి పలకకపోతే మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులాగానే రాజకీయ సమాధి తప్పదన్నారు. ఎమ్మెల్యేకు చట్టంపై, ప్రభుత్వ నిబంధనలపై గౌరవం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే ఇంజనీర్ లా వ్యవహరిస్తున్నాడని విమర్శలు చేయడం తగదని దుయ్యబట్టారు, ఎమ్మెల్యే ఏ వన్ కాంట్రాక్టర్ గా పని చేసిన అనుభవం ఉందన్నారు. ఓటు వేయలేదనే అక్కసుతో మార్కెట్ రోడ్డు లో కూల్చివేతలు చేస్తున్నారనే ఆరోపణలు విడ్డురంగా ఉన్నాయని విమర్శించారు. ఓట్లు ఎవరికి వేశారో ఎలా తెలుస్తుందో విద్యావంతుడైన రఘునాథ్ రావు చెప్పాలన్నారు. రోడ్డుపై అక్రమ నిర్మాణాలు ఉన్నందునే వాటిని తొలగిస్తున్నారని తెలిపారు. శ్రీరాంపూర్ లో పది ఎకరాల స్థలంలో డంప్ యార్డు నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 63వ జాతీయ రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్ మార్పు వెనుక రఘునాథ్ రావు హస్తం ఉందని ఇదే విషయమై పలుమార్లు ఢిల్లీకి వెళ్లాడని ఆరోపించారు. మంచిర్యాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృషి చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై తప్పుడు విమర్శలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ లు రావుల ఉప్పలయ్య, సూరిమిల్ల వేణు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, హాజిపూర్ మండల అధ్యక్షుడు తోట రవితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.