బాబోయ్ కుక్కలు.. నిద్రమత్తులో అధికారులు..
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ గ్రామానికీ చెందినవారు. చేతుల్లో కట్టెలతో వారు ఏ వేటకో ఎక్కడికో వెళ్ళడం లేదు. తమను తాము కాపాడుకోవడానికి కట్టెలు పట్టుకుని తిరుగుతున్నారు… ఇంతకి విషయం ఏమిటంటే..
మాదారం టౌన్షిప్ లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొద్దిరోజులుగా మనుషులపై దాడి చేస్తున్నాయి. వారం రోజుల కిందట ఒక కుక్క ముగ్గురు చిన్నారుల పైబడి కరిచింది. ఆ తరువాత మరి కొందరి పై దాడికి సైతం ప్రయత్నం చేసింది. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బయటికి వెళ్ళలంటే వణికే పరిస్థితి నెలకొంది. దీనితో పిల్లలు, వృద్దులు బయటికి వెళ్ళడం లేదు. ఎవరైనా బయటికి వెళితే కట్టెలు పట్టుకుని తిరుగుతున్నారు.
ఇంత జరుగుతున్నా అధికారులు నిద్రమత్తు వీడటం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యెక అధికారి ఈ విషయంలో పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రత్యెక అధికారి గ్రామంలో పర్యటించి వివరాలు తెలుసుకోవాల్సి ఉండగా పట్టించుకోకపోవడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామంలోని నేతలు సైతం ఈ విషయం గురించి పట్టించుకోకపోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, నేతలు గ్రామంలో పర్యటించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.