మహారాష్ట్ర వెళ్లిపోయిన జానీ
Tiger: ఆడ తోడు కోసం తపించింది… నెల రోజుల్లో 350 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసింది. అయినా తోడు లేకపోవడంతో ఆ పులి వెనుతిరిగింది. దాదాపు నెల రోజుల పాటు జానీ చేసిన ప్రేమ ప్రయాణం తెలంగాణలో ముగిసినట్లేనని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంఖ్య పెరుగుతోంది. పక్కనే మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి ఇక్కడకు యథేచ్ఛగా వచ్చిపోతున్నాయి. సాధారణంగా చలికాలంలో తోడు కోసం తిరిగే పులులు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. ఆడపులులు కూడా మగ తోడు కోసం సంచరిస్తుంటాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి అక్టోబర్‌లో జానీ అనే పెద్దపులి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అడవుల్లోకి ప్రవేశించింది. పశ్చిమ కనుమలుగా పేరున్న సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని అడవిలో కొన్ని రోజులు మకాం వేసిన ఆ పులి ఆడతోడు కోసం గడిచిన 30 రోజుల్లో 350 కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణం చేసింది.
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్, కుంటాల, కుభీర్, నర్సాపూర్(జి), దిలావర్‌పూర్, పెంబీ మండలాల్లో తిరిగిన పులి ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నార్నూర్ అడవుల్లో సంచరించింది. ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి ట్రాక్ చేస్తున్న అధికారులు.. వందల కిలోమీటర్లు మన అడవుల్లోనే తిరుగుతున్నట్లు చెప్తున్నారు. ఏడేండ్ల వయస్సున్న ‘జానీ’ తన ప్రయాణంలో ఐదు ఘటనల్లో పాడి పశువులపై దాడి చేసి చంపేసింది. మరో మూడు ఘటనల్లో పశువులపై దాడి చేసి గాయపరిచింది. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని ఖడ్కి అటవీ సమీపంలో పులి సంచరించింది. బుధవారం వేకువజామున కాలకృత్యాలకు వెళ్లిన గ్రామస్తులు పులిని చూసినట్టు తెలిపారు. అక్కడి నుంచి బురుకుంగూడ, లోకారి(కే), ధర్ముగూడ అటవీ ప్రాంతం నుంచి పులి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
అయితే, అదే పులి గాదిగూడ మండలం రాంపూర్ నుంచి మహారాష్ట్ర వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అడవుల్లోకి ఇటీవల మహారాష్ట్ర నుంచి రెండు పులులు వచ్చాయి. ఇందులో ఒకటి ఆడపులి ఉంది. కాకపోతే అది ఇక్కడే ఉందా? తిరిగి వెళ్లిపోయిందా? అన్న విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు.