మరో వివాదంలో కాంగ్రెస్
Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఆ పార్టీ “భారతదేశ మ్యాపు”ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక బెలగావిలో కాంగ్రెస్ అత్యున్నత సమావేశం సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది. మహాత్మాగాంధీ ఏఐసీసీ సమావేశానికి అధ్యక్షత వహించి శతాబ్ది గడవడంతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికోసం కాంగ్రెస్ పోస్టర్లను, బ్యానర్లను ప్రదర్శించింది. వీటిలో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా లేని భారతదేశ మ్యాపు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది.
భారతీయ జనతా పార్టీ దీనిపై విరుచుకుపడింది. ఈ సంఘటనను “అవమానకరం” అని పేర్కొంది. దేశాన్ని అస్థిరపరిచేందుకు US పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించింది. బీజేపీ కర్ణాటక రాష్ట్ర విభాగం ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది. “కాశ్మీర్ పాకిస్తాన్లో భాగంగా చిత్రీకరించడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా అగౌరవపరుస్తుంది” అని నిందించింది. ఇదంతా కేవలం తమ ఓటు బ్యాంకుని సంతోషపెట్టడానికే అని, ఇది సిగ్గుచేటని బీజేపీ పోస్ట్ చేసింది. బీజేపీ సీనియర్ నేత షెహజాద్ పూనావాలా ఈ వివాదంపై స్పందిస్తూ ఇది “భారత్ టోడో, తుకే తుక్తే” ఆలోచనల్ని నొక్కి చెబుతోందని అన్నారు.
విలేకరుల సమావేశంలో బీజేపీ నేత సుధాన్షు త్రివేది మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు తాము చేసిన ప్రమాణాన్ని కాంగ్రెస్ నేతలు ఉల్లంఘించడం ఆందోళనకరం, దురదృష్టకరమన్నారు. “సోరోస్ సీక్రెట్ సర్వీస్ నుండి వీళ్లకు ఏదైనా సంకేతం వస్తోందా లేదా ఇంకేదైనా భారత వ్యతిరేక శక్తి మీకు ఏడు సముద్రాల నుంచి నిరంతరం సంకేతాలు ఇస్తోందా? ఇది యాధృచ్చికం కాదు, ఎందుకంటే వారు గతంలో ఇలాంటి చవకైన పనులు చేసారని దుయ్యబట్టారు.”మీ ట్వీట్లలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ఎందుకు కత్తిరించారని మేము కాంగ్రెస్‌ను అడగాలనుకుంటున్నాం. ఇది కేవలం యాదృచ్చికమా లేక భారత వ్యతిరేక కుట్రలో భాగమా?” అని ప్రశ్నించారు.