పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్
Pawan Kalyan: ఆయన హడావిడి… పోలీస్ డ్రెస్ చూసి ఐపీఎస్ అనుకున్నారు.. ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న అధికారికి సెల్యూట్ కొట్టి, ఫోటోలు సైతం దిగారు కొందరు అధికారులు.. కానీ, తీరా విషయం తెలిసి షాక్ అయ్యారు. ఏకంగా వై కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాడు. చివరికి అతను నకిలీ ఐపీఎస్ అని తెలిసి అంతా ఖంగు తిన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి ఐపీఎస్ యూనిఫారంతో వచ్చి పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొన్నారు. ఆయన చుట్టూ పదే పదే తిరిగారు. కొందరు అధికారులు సైతం ఆయనకు సెల్యూట్ చేసి మరీ ఆయనతో ఫొటోలు సైతం దిగారు. కానీ, అతను ఐపీఎస్ కాదని సమాచారం తెలియడంతో బిత్తరపోవడం పోలీసుల వంతైంది. ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ గా గుర్తించారు. గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాష్ ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెప్పాడు. సొంత కారు ఇంటి దగ్గరే విడిచి పెట్టి వేరే కార్లో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన సూర్య ప్రకాష్ ను విజయనగరం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, సూర్య ప్రకాష్ తప్పించుకునేందుకు ఓ ఏఆర్ కానిస్టేబుల్ సహకరించినట్లు అధికారులు గుర్తించారు. తన వాహనాన్ని కూడా ఆ కానిస్టేబుల్ ఇంటి దగ్గరే విడిచి పెట్టిన సూర్యప్రకాష్ వేరే కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీఎస్ అధికారా కాదా అనే వివరాలను సేకరిస్తున్నారు. సూర్యప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనికలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేశాడు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కల్యాణ్ చుట్టూ నకిలీ ఐపీఎస్ తిరగడంపై విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటనలో అసలు భద్రతా లోపం ఎలా తలెత్తిందని ఉన్నతాధికారులను హోంమంత్రి ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.