ఆగని ఆరిజన్ మంటలు
-సంవత్సరాల తరబడి ఆరని వివాదం
-తాజాగా ఆదినారాయణపై దాడితో మరింత రచ్చ
-మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు
-తనకేం సంబంధం లేదంటున్న దుర్గం చిన్నయ్య
-పోలీసుల వైఫల్యం వల్లనే ఇలాంటి ఘటనలు అంటూ మండిపాటు
-దాడికి పాల్పడింది, గాయపడింది కూడా కాంగ్రెస్ వాళ్లేనంటూ వెల్లడి
-ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఆందోళన
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సంబంధించిన ఆరిజన్ వివాదం సద్దుమణగడం లేదు. అది మండుతూనే ఉంది. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఏదో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆ సంస్థ ఎండీ ఆదినారాయణపై జరిగిన దాడి సంచలనం సృష్టించింది. తనను చంపడానికే దుర్గం చిన్నయ్య దాడి చేయించారని ఆదినారాయణ ఆరోపించారు. చిన్నయ్యపై కేసు కూడా నమోదు అయ్యింది. అయితే కావాలనే ఇదంతా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.
ఆరిజన్ డైరీ విషయంలో రోజుకో వివాదం సోషల్‌మీడియాకు ఎక్కుతోంది. ఆరిజన్ నిర్వాహకులు మొదటి నుంచి దుర్గం చిన్నయ్య మీద ఆరోపణలు చేస్తూ ఆయనను చికాకు పెడుతూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు నుంచే ఈ వివాదం కొనసాగింది. అంతకుముందు ఆయనపై నిత్యం వీడియోలు విడుదల చేస్తూ దుర్గం చిన్నయ్య మీద ఆరోపణలు సంధించారు. మొదట ఆ సంస్థ నిర్వాహకులు ఓ ఆడియో, కొన్ని వాట్సప్ చాటింగ్ వివరాలు బయటకు రావడం సంచలనంగా మారింది. ఆ తర్వాత నిర్వాహకురాలు షెజల్ ఓ వీడియో విడుదల చేశారు. దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో ఆరిజిన్ పాల సంస్థను ప్రారంభించడానికి తమ వద్ద భారీగా ముడుపులు తీసుకొని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టించాడని ఆరోపించారు. తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, అమ్మాయిలను పంపించాలని కోరితే బ్రోకర్ల ద్వారా అమ్మాయిలను సైతం పంపించినట్లు వెల్లడించారు.
ఆరిజన్ డైరీ సీఈవో ఆదినారాయణ సైతం మరో వీడియో విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని దానిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాము చెప్పినవన్నీ నిజాలేనని స్పష్టం చేశారు. తమ వద్ద విడతల వారీగా రూ. 30 లక్షలు తీసుకున్నారని దుయ్యబట్టారు. లేఖలు, వీడియోలు విడుదల చేసిన ఆదినారాయణ చివరకు కోర్టు మెట్లెక్కారు. పోలీసులు, ఎమ్మెల్యే చిన్నయ్యను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆరుగురిని ప్రతివాదులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. చిన్నయ్య తమను బెదిరింపులకు గురిచేయడంతో పాటు, తమపై పోలీసుల సాయంతో ఒకేరోజు పది కేసులు పెట్టించారని కోర్టుకు విన్నించారు.
ఇదంతా గతం… ఇక తాజాగా జరుగుతున్న వ్యవహారం కూడా సంచలనంగా మారింది. గత నెల 29న ఆరిజన్ డైరీ సీఈవో ఆదినారాయణపై బెల్లంపల్లిలో దాడి జరిగింది. నన్ను చంపడానికే ఈ దాడి చేయించినట్లు ఆదినారాయణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే దుర్గం చిన్నయ్యతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసు విషయంలో చిన్నయ్య స్పందించారు. ఆదినారాయణను అడ్డం పెట్టుకుని తనపై బురదచల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసలు ఆయనను పెంచిపోషించిందే ఎమ్మెల్యే గడ్డం వినోద్ అని స్పష్టం చేశారు. దాడికి పాల్పడింది, గాయపడ్డది కూడా కాంగ్రెస్ వారేనని గుర్తు చేశారు. ఈ కేసులు కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని అన్నారు.
అయితే ఈ వ్యవహారంలో అసలైన ట్విస్టు ఏమిటంటే ఆదినారాయణపై దాడి చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ వారు కూడా ఉన్నారు. మరి వారు ఎందుకు దాడి చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఎన్నో ఏండ్లుగా ఆరిజన్ డైరీ వివాదం కొనసాగుతోంది. మరి ఈ మంటలు ఎప్పుడు ఆరిపోతాయో చూడాలి మరి.