మాకు కార్మికుల ప్రాణాలే ముఖ్యం

రక్షణపై ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలి - నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు - సింగ‌రేణి సీఅండ్ఎండీ ఎన్‌. శ్రీ‌ధ‌ర్

హైద‌రాబాద్ : సింగరేణిలోని ప్రతీ గనిలో, విభాగంలో రక్షణ పెంపుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రక్షణ పెంచేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడవద్దని సింగరేణి సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఏరియా జనరల్‌ మేనేజర్లను కోరారు. సోమవారం హైద‌రాబాద్‌ సింగరేణి భవన్‌ నుండి డైరెక్టర్లు, అడ్వయిజర్లు, అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో ప్రత్యేక వీడియో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రమాదాలలో 4 గురు కార్మికులు ఒక అధికారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమ‌న్నారు. రక్షణ లేని ఉత్పత్తి వ్యర్ధమ‌ని, ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలు, వారి రక్షణే ముఖ్యమ‌న్నారు. కనుక కార్మికుల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గని అధికారులదేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైన వారికి శిక్షణ ఇవ్వాల‌ని, రక్షణకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాల‌ని  జి.ఎం.లను కోరారు. భారీ యంత్రాల రక్షణకు కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రక్షణ చర్యలు పాటించని వారిపైన, తగిన రక్షణ చర్యలు తీసుకోని వారిపైన కఠిన చర్యలు ఉంటాయనీ హెచ్చ‌రించారు. చిన్న, పెద్ద ఉద్యోగి అనే తేడా లేకుండా బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. నవంబర్‌ నెలలో ఇప్పటి వరకూ సాధించిన బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాపై ఆయన సమీక్షించారు. ఇటీవలి వర్షాల వలన బొగ్గు ఉత్పత్తికి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ ఇంకా మిగిలిన రోజుల్లో రోజుకి 2.10 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ ను తొలగించాలని నిర్దేశించారు.అన్ని ఏరియాల వారు తమకు కేటాయించిన లక్ష్యాలు సాధించాలని, మార్చి నెలాఖరుకు 680 లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించాలని ఆదేశించారు. భూసేకరణ, ఆర్‌ & ఆర్‌ సమస్యలను జిల్లా ప్రభుత్వ యంత్రాంగ సహాయంతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఅండ్‌ ఎం.డి.తో పాటు డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్స్‌ & ప్లానింగ్‌, పర్సనల్‌) బలరామ్‌, అడ్వయిజర్‌ (మైనింగ్‌) డి.ఎన్‌.ప్రసాద్‌, అడ్వయిజర్‌ (ఫారెస్ట్రీ) కె.సురేంద్రపాండే, ఇ.డి. కోల్‌ మూమెంట్ జె.ఆల్విన్‌, జి.ఎం. కో-ఆర్డినేషన్‌, కె.సూర్యనారాయణ, జి.ఎం. (స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌) సురేందర్ పాల్గొన్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like