ఘ‌నంగా ప్రారంభ‌మైన మ‌హాకుంభ‌మేళ

Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళ’ ఘ‌నంగా ప్రారంభమైంది. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం దగ్గర మొదటి స్నానంతో మహాకుంభమేళా ప్రారంభించారు. త్రివేణి సగమం ఒడ్డున పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు తరలివచ్చారు. బ్రహ్మ ముహూర్తం నుంచి భక్తజన సంచారం సంగమం తీరం వైపు కదులుతోంది. పౌష్యపూర్ణిమ రోజు నుంచి కుంభ‌మేళా ప్రారంభించ‌డం ఆన‌వాయితీ. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది మ‌హాకుంభ‌మేళా కావ‌డంతో భ‌క్తులు, సాధువులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు.

భక్తుల పూజలతో ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ ఒక్కరోజు కోటి మందికిపైగా భక్తులు గంగా స్నానం చేస్తారని అంచనా. అయితే, ఉదయం 7.30గంటల వరకే 35లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్ రాజ్ అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45రోజుల పాటు మహా కుంభమేళా కొనసాగనుంది. ఈ ఏడాది కుంభమేళాకు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది.

మహాకుంభ మేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు ఈ కుంభమేళాకు వస్తుంటారు. పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించారు. యాత్రికులకు ఇబ్బంది తలెత్తకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగుదొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45వేల మంది పోలీసులు కుంభమేళా బందోబస్తులో పాల్గొంటున్నారు. తెలుగుతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది.

గంగ, యమునా, సరస్వతి అనే మూడు నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ మూడు నదులు ప్రయాగ్ రాజ్ లోని సంగం వద్ద కలుస్తాయి. దీంతో ఈ ప్రయాగ్ రాజ్ ఒక యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచింది. మహా కుంభమేళాలో షాహి స్నాన్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని అమృత్ స్నాన్ అని కూడా పిలుస్తారు. షాహి స్నాన్ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ 3వేల ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు మొత్తం 13వేలకుపైగా ట్రిప్పులు వేయనున్నాయి. ప్రయాగ్ రాజ్ జంక్షన్ తో పాటు ఎనిమిది సబ్ స్టేషన్లు నిర్మించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారి కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి సుమారు 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మహాకుంభ మేళాకు 15లక్షల మందికిపైగా విదేశీ పర్యాటకులు వస్తారని కేంద్ర పర్యాటక శాఖ అంచనా వేస్తుంది. విదేశీ అతిథులను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ ఆయుర్వేదం, యోగా, పంచకర్మ వంటి సౌకర్యాలను కల్పిస్తూ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేలా మహా కుంభమేళాలోని పది ఎకరాల్లో ‘కళాగ్రామం’ నిర్మించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like