అసలు ఘట్టం.. అమృత స్నానం..
Maha Kumbh mela: ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా అసలు సంరంభం ఆరంభమయ్యింది. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు, నాగసాధువులు అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం ఉదయం పుష్య పూర్ణిమ స్నానంతో మొదలైన ఈ కుంభమేళ ఈ రోజు (మంగళవారం) మకర సంక్రాంతి సందర్భంగా అమృతస్నానంతో అసలు ఘట్టం మొదలైంది. 144 ఏండ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
కుంభమేళాలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి శుభ సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారు జామునుంచే గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో సనాతన ధర్మంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులు, రుషులు ఇవాళ పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. సనాతన ధర్మంలోని 13 అఖాడాల క్రమాన్ని మహా కుంభమేళా పరిపాలన విభాగం ఖరారు చేసింది. ప్రతి అఖాడాకు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు సమయాన్ని ఖరారు చేశారు.
శ్రీ పంచాయతీ అఖరా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖారా తొలుత అమృత స్నానం చేశారు. రెండు అఖరాలు ఉదయం 5.15 గంటలకు శిబిరం నుంచి బయలుదేరి 6.15గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. 40 నిమిషాల పాటు వీరు పవిత్ర స్నానాలు చేశారు. తరువాత శ్రీ తపోనిధి పంచాయతీ, శ్రీ నిరంజని అఖారా మరియు శ్రీ పంచాయతీ అఖారా ఆనంద్ ఉదయం 7.05 గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. రెండు అఖారాలకు చెందిన నాగ సాధువులు 40 నిమిషాల పాటు పవిత్ర సంగమంలో అమృత స్నానం చేశారు. ఇలా.. వారికి కేటాయించిన సమయం ప్రకారం అఖారాలు ఘాట్ వద్దకు చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా 45 రోజులు పాటు కొనసాగనుంది. తొలిరోజు సాయంత్రం 6గంటల వరకు 1.65కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే, కుంభమేళాలో రెండోరోజు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ట్విటర్ ఖాతాలో మహాకుంభ మేళాలో మంగళవారం తెల్లవారు జామున తీసిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఇది మన సనాతన సంస్కృతి, విశ్వాసానికి సజీవ రూపం అని స్పష్టం చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద మొదటి అమృత స్నానం ఆచరించి పుణ్యం పొందిన భక్తులందరికీ అభినందనలు తెలిపారు.