పాపం.. మోనాలిసా..

Mahakumbha Mela 2025: అటు మీడియా, ఇటు సోష‌ల్ మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేశాయి… అద్భుత సుంద‌రి అంటూ మొత్తం ఆమెనే హైలెట్ చేశాయి… దీంతో స‌హ‌జంగానే త‌న‌కి ఇబ్బందులు త‌ప్ప‌లేదు. నిత్యం పూస‌లు అమ్ముకుని పొట్ట‌పోసుకునే తాను ఆ ప‌ని చేసుకోకుండానే ఇంటికి వెళ్లిపోయేలా చేశారు ఈ మ‌హానుభావులు..

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబురం.. కోట్లాది మంది భ‌క్తులు, తపోధ‌నులు, స‌న్యాసులు వ‌చ్చే ఓ వేడుక‌.. అయితే, ఈ మహా కుంభమేళాను మీడియా పెద్ద‌గా పట్టించుకోవడం లేదని ప‌లువురు ఆధ్యాత్మిక వేత్త‌లు తిట్టిపోస్తున్నారు. కేవ‌లం టీఆర్పీల కోసం వెంప‌ర్లాడ‌టం త‌ప్ప రికార్డులు సృష్టించే ఇలాంటి కార్యక్ర‌మం క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇదంతా ఒక్కెత్తు అయితే, మీడియా మ‌హాకుంభ‌మేళాలో ఓ పిల్లిక‌ళ్ల సుంద‌రిని హైలెట్ చేసింది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన మోనాలిసా అనే యువ‌తి మహా కుంభమేళాకు వచ్చి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ము కుంటున్నది. ఎవరో చూశారు. వీడియో తీశారు. పోస్టు చేశారు. అంతే తెగ వైరల్ అయిపోయింది. ఇక మీడియా మొత్తం ఆమె వెంటే.. మోనాలిసా కోసం కుంభమేళాలో వెతకడం ప్రారంభం అయ్యింది. ఆ అమ్మాయి అద్భుతం.. ఆహా… ఓహో.. అంటూ అన్ని ఛాన‌ళ్లు, ప‌త్రిక‌లు మోనాలిసా వెంట ప‌డ్డాయి.

ఇంటికి పంపిన తండ్రి..
అలా ఆ అమ్మాయి కాస్తా వైర‌ల్ కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ ఆమె వెంట ప‌డ‌టం ప్రారంభించారు. పూస‌లు, రుద్రాక్ష‌లు తీసుకోవ‌డం మానేసి ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగ‌డం మొద‌లెట్టారు. ఆమె పాపులర్ అయినప్పటికీ, వారి వ్యాపారం మాత్రం దెబ్బతిన్నది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి యూట్యూబర్లు ఎగబడుతున్నారే తప్ప, ఆమె అమ్మే రుద్రాక్ష మాలలు ఎవరూ కొనడం లేదు. పైగా ఆమెను ఇంటర్వ్యూల కోసం ఇబ్బంది పెట్టడంతో.. ఆమె తండ్రి ఆవేదన చెందారు. ఈ హడావిడి తగ్గే వరకు ఇంటికి వెళ్లాలని ఆమె తండ్రి సూచించారు. ఈ నిర్ణయంతో ఆమె కుంభమేళా నుంచి ఇండోర్ లోని తన సొంత ఇంటికి వెళ్లిపోయింది.

మీడియా అతిపై నెటిజన్ల ఆగ్రహం
మీడియా, సోషల్ మీడియా అతి కారణంగా ఓ అమ్మాయి వ్యాపారానికి తీవ్ర ఇబ్బంది కలిగిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు చేసిన పని కారణంగా ఆమె కుటుంబం ఉపాధి కోల్పోయేలా చేసిందంటున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడటం మూలంగా ఇప్పుడు ఆమె అక్కడి నుంచి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులకు నష్టం కలిగించే ప్రవర్తించకూడదని దుమ్మెత్తి పోస్తున్నారు. అస‌లు కొన్ని ఛాన‌ళ్లు, ప‌త్రిక‌లు ఏకంగా కుంభ‌మేళా నుంచి టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌డానికి ఇలా ప్ర‌య‌త్నించార‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ఓ అమాయ‌క యువ‌తి మీడియా అతి వ‌ల్ల నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు తాను పొట్ట‌పోసుకునే వృత్తిని సైతం వ‌దులుకుని ఇంటికి వెళ్లాల్సి వ‌చ్చింది.. ఇప్ప‌టికైనా ఆ అతి మానుకుంటారో..? లేదో..?

Get real time updates directly on you device, subscribe now.

You might also like