ఇద్ద‌రు జ‌వాన్లు.. 12 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh Encounter : ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల‌లో మావోయిస్టులు వ‌రుస‌గా మృత్యువాత ప‌డుతున్నారు. ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఆదివారం ఉదయం చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో దంతెవాడ జిల్లాలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ జోగా బర్సేను నక్సలైట్లు ఆయన కుటుంబ సభ్యుల ముందే నరికి చంపారు. ఈ సంఘటన అరన్‌పూర్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. బార్సే గతంలో సర్పంచ్‌గా పనిచేసి మళ్లీ అదే పదవికి ఎన్నికల్లో పోటీ చేశారు.

ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. “ప్రాథమిక సమాచారం ప్రకారం, కాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మరణించారు” అని పిటిఐ కథనం తెలిపింది. కాల్పుల్లో మరణించిన మావోయిస్టులను గుర్తిస్తున్నామని, ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను భ‌ద్ర‌తాబ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని బలగాలను ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తరలించినట్లు అధికారులు వెల్ల‌డించారు.

కాగా.. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారీ ఎత్తున వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. గత ఐదురోజుల కింద‌ట‌ బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృత్యువాత ప‌డ్డారు. ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం మొత్తాన్ని భారీగా భద్రతా బలగాలు నలువైపులా చుట్టుముట్టి వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. అగ్రనేతలు తప్పించుకున్నట్లు బస్తర్ ఐజి పి.సుందర్‌లాల్‌ తెలిపారు.

అలాగే జనవరి 21 గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లాలోని పామేడు, బాసగూడ, ఊసురు గంగ పోలీస్‌స్టేసన్ పరిధిల్లోనే ఎక్కవగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. తెలంగాణ సరిహద్దు సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు సుప్రీం కమాండర్‌గా ఉన్న మడవి హిడ్మాతో పాటు తెలంగాణ కార్యదర్శి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భారీగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిత్యం భద్రతాబలాగాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న కాల్పులు, ప్రతి కాల్పులతో దండకారణ్యం ఒక యుద్ధ భూమిగా మారిన పరిస్థితి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like