ఆ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టులు..?
Telangana Maoists in Chhattisgarh encounter..? ఇంద్రావతి ఎన్‌కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీకి చెందిన అగ్రనాయకత్వం సమావేశం అయ్యారని నిఘా వర్గాల సమాచారంతో చత్తీస్‌ఘడ్ బలగాలు చుట్టుముట్టాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మరణించగా, తెలంగాణ అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అగ్రనాయకత్వం ఎవరు..? హతమైన వారిలో మన ప్రాంతానికి చెందిన వారు ఎంత మంది అని ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కొంత మంది పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన బండి ప్రకాష్ అలియాస్ బీపీ పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వికల్ప్ తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. నక్సల్స్ ఇన్‌వెస్టిగేషన్ బ్యూరో, స్టేట్ ఇంటలిజెన్స్, సెంట్రల్ ఇంటలిజెన్స్, స్థానిక ఎస్‌బీ, పోలీసులు అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆరా తీస్తున్నారు. తమ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారా..? వారు ఎవరు అంటూ సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు.
బలం చేకూరుస్తున్న ఐజీ మాటలు..
ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మీడియాతో మాట్లాడిన బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో తెలంగాణకు సంబంధించిన క్యాడర్ సమావేశం అయ్యాయని తమకు సమాచారం అందడంతో బలగాలు కూంబింగ్ చేపట్టినట్లు వెల్లడించారు. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో ప్రత్యేకత కలిగిన రాష్ట్ర స్థాయి దళాలైన DRG, STF, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాఫ్ రైఫిల్, 303 బీపీఎల్ లాంచర్ స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాల గుర్తింపు కోసం..
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులను తీసుకువెళ్లి గుర్తించే పనిలో ఉన్నారు. వారిని గుర్తించిన తర్వాత మావోయిస్టు కుటుంబాలకు వారి మృతదేహాలను అప్పగించనున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఖచ్చితంగా పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీలో తెలంగాణ క్యాడర్ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంద్రావతి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు.