నిన్న ఆగ్రహం.. నేడు అనుగ్రహం..
Koneru Konappa: నిన్నా మొన్నటి వరకు వేడెక్కిన సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయం చప్పున చల్లారింది. కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారన్న వ్యవహారం సంచలనం సృష్టించింది. అయితే, అధిష్టానం జోక్యం చేసుకోవడం, ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడటంతో వ్యవహారం టీ కప్పులో తుఫానులా మారింది..
సిర్పూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గం. కేవలం నంబర్‌లోనే కాదు.. రాజకీయంగా కూడా అదే స్థాయిలో కొనసాగుతుంటుంది… ఎప్పుడూ ఏదో వ్యవహారంతో రాష్ట్రస్థాయిలో నిలుస్తుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారం కూడా అదే స్థాయిలో వేడెక్కించింది. కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ వీడతానని స్పష్టం చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల ఆయన కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పక్క జిల్లాకు చెందిన ఓ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్ ఇద్దరూ కలిసి సిర్పూరు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. కోనేరు కోనప్పను పక్కనపెట్టి మరీ వారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా అన్నింటిలో కోనప్ప పాత్ర నామమాత్రంగా మారింది. ఈ వ్యవహారం నచ్చని కోనప్ప కాంగ్రెస్ వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక తన నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ రద్దు కావడంతో పాటు గత ప్రభుత్వంలో ఆయన తీసుకువచ్చిన అభివృద్ది పనులను సైతం పక్కన పెట్టడం కోనప్పను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. ఇలా తన పాత్ర నామమాత్రం కావడంతో వారం రోజుల కిందట సమావేశం ఏర్పాటు చేసిన కోనేరు కోనప్ప తాను ప్రజల మనిషిని అంటూ చెప్పుకొచ్చారు. పార్టీలతో సంబంధం లేదని ప్రజల మద్దతుతో గెలుస్తున్నాని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను దొంగల గుంపుగా విమర్శించారాయన. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే కోనప్ప పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. స్వతంత్రంగా ఉంటానని కోనప్ప ప్రకటించారు.
ఇలా ప్రకటన రావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కిపడింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీని వీడితే తీరని నష్టం జరిగే అవకాశం ఉందని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ వీడకుండా చర్యలు తీసుకుంది. సీఎం కార్యాలయం నుంచి కోనప్పకు ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని శనివారం ఉదయం రావాలన్నది ఆ ఫోన్ సారంశం. దీంతో శనివారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి , కోనేరు కోనప్ప, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి గంటపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సిర్పూర్ నియోజక వర్గ అభివృద్ధి, పెండింగ్ బిల్లులు, పనుల మంజూరు పై ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు. వాటన్నంటికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో కోనేరు కోనప్ప మెత్తబడ్డట్లు సమాచారం.