ఆ నా కొడుకును చంపేయ్.. మిగతావి నేను చూసుకుంటా..
Murder Case: ఆ నా కొడుకుని చంపేయ్రా.. బెయిల్ ఖర్చులతో పాటు… మిగతావి ఏమైనా ఉన్నా నేను చూసుకుంటా.. లాయర్ సంజీవరెడ్డి చనిపోయాక వీడు నా వెెంట పడుతున్నాడు.. ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న భూమి నాకు కాకుండా చేయాలని చూశాడు.. ఇదీ నాగవెళ్లి రాజలింగమూర్తి హత్యకు ముందు బీఆర్ఎస్ నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు మాట్లాడిన మాటలు.. హత్య చేసే ముందు ప్రధాన నిందితుడు రేణుకుంట్ల సంజీవ్ వెళ్లి హరిబాబును కలిశాడు. అతనితో చంపేయమంటూ చెప్పినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత హరిబాబును ఏ 8 గా చేర్చి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో హరిబాబు పాత్ర ఇంకేమైనా ఉందా…? ఉంటే ఈ విధమైన సహకారం ఉందంటూ లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.
భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ హత్య కేసు విషయంలో ఎన్నో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భూ వివాదంలోనే ఈ హత్య జరిగినప్పటికీ ఇందులో ఎవరి పాత్ర ఏమిటి..? ఇంకా వెనక ఎవరెవరు ఉన్నారు..? అనే విషయంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. దానిలో భాగంగానే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హరిబాబు పాత్రపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించినట్లు విశ్వసనీయ సమాచారం. హత్య జరిగిన తర్వాత.. కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) విశ్లేషిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేత పాత్రపై ఆధారాలు దొరికాయి. బుధవారం సాయంత్రం హత్య జరగ్గా.. నిందితుల్లో ఒకరైన రేణిగుంట్ల సంజీవ్(ఏ1).. హరిబాబును ఫోన్ద్వారా సంప్రదించినట్లు పోలీసులు గుర్తించారు.
హరిబాబు కాల్ డేటా విశ్లేషించి, ఆ రోజు మాట్లాడిన వ్యక్తులందరినీ పిలిపించి.. విచారించారు. ఈ క్రమంలో భూపాలపల్లికి చెందిన ఇద్దరు రేషన్ డీలర్లు, ఒక వీఆర్ఏ, రియల్ఎస్టేట్ వ్యాపారి పేర్లు తెరపైకి వచ్చినట్టు సమాచారం. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. హరిబాబుకు అత్యంత సన్నిహితులైన ఖాశీంపల్లికి చెందిన ఇద్దరు ప్రధాన అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు. హరిబాబు గతంలోనూ వివాదాస్పద కేసుల్లో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో భూపాలపల్లి జిల్లాలో పాదయాత్ర జరిపినప్పుడు ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ కేసులో హరిబాబు ప్రధాన నిందితుడు. దాదాపు పది కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం రాత్రి భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబును అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు పట్టణంలోని రెడ్డికాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు. అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు.