బీఆర్ఎస్ ముగిసిన కథ. కాంగ్రెస్ పార్టీది విఫల కథ
-రాష్ట్రాన్ని పాలించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని ముఖ్యమంత్రి భయపడుతున్నడు
-కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-కేసిఆర్ నిజస్వరూపం తెలవడానికి 9 సంవత్సరాలు పడితే..
-రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలవడానికి 9 నెలలే పట్టింది
-బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజం
Etela Rajender:బీఆర్ఎస్ ముగిసిన కథ. కాంగ్రెస్ పార్టీది విఫల కథ అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్.. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. 14 నెలల పాలనలోనే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే నిన్న రేవంత్ రెడ్డి మూడు జిల్లాలో పర్యటించి బీజేపీపై విషం కక్కారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ యువతను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని విమర్శించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఈ నెల 27 న జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని కోరారు.
ప్రజల అభిప్రాయం మేరకు మీ తీర్పు ఇవ్వండి..
భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలుగా మల్కా కొమరయ్య, పులి సరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు టీచర్లు లెక్చరర్లు మీరంతా మేధావులు… అన్ని విషయాలపట్ల అవగాహన ఉన్నవారు… అన్ని పార్టీల చరిత్రను కల్లారా చూసినవారు… ఇప్పుడు మీ వైపు తెలంగాణ సమాజమంతా చూస్తోంది.. తెలంగాణ సమాజం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ఒక సంకేతాన్ని ఇచ్చింది. దిక్సూచిగా నిలిచింది. ఆ ప్రజల అభిప్రాయం మేరకు మీరు కూడా బీజేపీకి ఓటు వేయాలని ఈటెల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని.. ప్రజల ఆలోచనను బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.
టీచర్లకు నరకం చూపించారు…
తొమ్మిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ చూసాం… ఎన్నో సంవత్సరాలు చూసినా మరోసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ కి ఓటు వేసాం.. కేసిఆర్ నిజస్వరూపం తెలవడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలపడానికి 9 నెలలే పట్టిందన్నారు.. ఈ రెండు పార్టీలు మాకు వద్దు బీజేపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 317 జీవో తీసుకొచ్చి కేసీఆర్ టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర. పుట్టిన జిల్లా ఒకటి పని చేసే జిల్లా మరొకటి ఇలా కెసిఆర్ నరకం చూపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రాగానే ఈ జీవో సరిచేస్తామని హామీ ఇచ్చింది. ఆ పని చేయక టీచర్ల దగ్గరికి వెళ్లే ముఖం లేక డైరెక్ట్ గా అభ్యర్థిని పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ సమస్యల పట్ల కొట్లాడేది బీజేపీనే..
టీచర్లు లెక్చరర్లు మీ సమస్యలు, 317 జీవో, సిపిఎస్ పెన్షన్ విధానం, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఐదు డిఏల పెండింగ్, మీకు ఇస్తా అన్న హెల్త్ కార్డులు, పదివేల స్కూల్లో హెడ్మాస్టర్ పోస్టులు, ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు.. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా టీచర్లను మరోసారి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. ఎవరు గెలిచినా మేము కాంగ్రెస్ కు పోతామని మాట్లాడుతున్నారని, అధికార పార్టీ వారు గెలిస్తే మీ కళ్ళల్లో మట్టి కొట్టి బానిస లెక్క ఉంటారన్నారు. రేపు మీ సమస్యల పట్ల కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ మోసం చేశాడు..
కేసీఆర్.. నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాల కల్పన చేస్తానని చేయలేదు అందుకే ఆయనను ఓడగొట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీతో నిరుద్యోగులకు పాలసీని ప్రకటించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నాలుగు వేల భృతి ఇస్తామన్నారు… 2 లక్షల కొత్త ఉద్యోగాలు నింపుతామన్నారు…. 10 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తామన్నారు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రైవేటు కంపెనీలలో ఐటీ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% లోకల్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.. ఏ ఒక్కటైనా అమలు చేశారా…? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి ఆశలు సన్నగిల్లాయి..
పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు తప్ప కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇవన్నీ అర్థమయ్యే రేవంత్ రెడ్డి నిన్న వచ్చి వారు గెలిచే పరిస్థితి లేదు అని తేల్చిచెప్పారని అన్నారు. ఈ ఒక్క ఎమ్మెల్సీ గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి.. గెలిచిన ఓడిన నా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదని చెప్పి ఆయన మాట్లాడారని స్పష్టం చేశారు. ఆయనకు ఆశలు సన్నగిల్లాయని ఈటెల వెల్లడించారు.
యువత కోసం మోదీ చేస్తున్న పనులు ఎన్నో..
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ.. నిరుద్యోగ సమస్య అర్థం చేసుకొని దేశం ఎదగాలంటే యువతను భాగస్వాములు చేయాలని నాలుగు లక్షల కోట్ల రూపాయలు 2024 – 25 బడ్జెట్లో పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసారని, ఇక్కడ ఉన్న కంపెనీలలో ఉద్యోగుల కల్పన కోసం.. ప్రైవేటు కంపెనీలను పెట్టుకోవడానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు బాటలు వేస్తున్నారని ఈటెల చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమైనా.. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి, గుజ్జుల రామకృష్ణ రెడ్డి, రజనీష్ జైన్, రావుల రామనాథ్, పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, జోగుల శ్రీదేవి, అమిరిశెట్టి రాజు, పల్లి రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు