పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
-తమ నేతపై ఎస్ ఐ చేయిచేసుకున్నాడని బీజేపీ నేతల ఆరోపణ
-జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన
-పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తే బయటకు పంపామన్నఎస్ఐ
-ఎవరిపైనా చేయి చేసుకోలేదని వెల్లడి
-కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం
-ఇరువర్గాలను శాంతింపచేసిన కమిషనర్ శ్రీనివాస్
పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ(BJP) నేతలు ఆరోపించారు. తమ నేతపై చేయి చేసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత కమలాకర్ రావు పై స్థానిక నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ గురువారం నస్పూర్ లోని తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు. తమపై ఎస్ఐ దాడి చేశాడని బీజేపి నాయకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని కమలాకర్ రావు సహా బీజేపీ నాయకులను పరామర్శించారు.
ఈ విషయంలో ఎస్ఐ మాట్లాడుతూ తాను ఎవరి పై చేయి చేసుకోలేదన్నారు. పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తే బయటకు పంపామన్నారు. ఈ ఘటన జరుగుతున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేసినా అదుపులోకి రాకపోవడంతో రామగుండం సీపీ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటన పై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలింగ్ బూతు వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించామన్నారు. ఎస్ఐ తోసాడనే ఆరోపణలపై వివరాలు సేకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.