కాంగ్రెస్ నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెన్ష‌న్‌

Congress: త‌మ ఎమ్మెల్సీ తీన్‌మార్ మ‌ల్ల‌న్న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ చిన్నారెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్నకి కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కులగణన సర్వే నివేదికని వ్యతిరేకిస్తూ దాని కాపీని తగులబెట్టినందుకు వివరణ ఇవ్వాలని నోటీసులో కోరింది. ఇటీవల వరంగల్ బీసీ సభలో సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశయించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో కోరింది.

శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేలో బీసీల సంఖ్య 40 లక్షలు తగ్గించి చూపిందని, ఇది బీసీలను మోసం చేయడమే అని తీన్‌మార్ మల్లన్న తమ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇటీవల సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి అగ్రకులాల చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కూడా సిఎం రేవంత్ రెడ్డి, పార్టీలో రెడ్డి సామాజిక వర్గంపై తీన్‌మార్ మల్లన్న విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కనుక వీటన్నిటికీ సంతృప్తికరమైన సంజాయిషీ ఇవ్వాలని లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసి వస్తుందని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

తీన్‌మార్ మల్లన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు నచ్చడంలేదని ఆయన మాటలతోనే స్పష్టమయ్యింది. కాంగ్రెస్ పార్టీ కూడా అతనిని ఇంక ఎంత మాత్రం భరించే పరిస్థితిలో లేదని నాయ‌కులు ముందు నుంచి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన మీకు నోటీసులు జారీ చేశామ‌ని, 12వ తేదీ లోపుగా మీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చెప్పామ‌ని అయినా మీ ద‌గ్గ‌ర నుంచి ఎలాంటి వివ‌ర‌ణ రాకపోవ‌డంతో మిమ్మ‌ల్ని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ మీనాక్షి న‌ట‌రాజ‌న్ వ‌చ్చి రావ‌డంతోనే ఈ వేటు ప‌డిన‌ట్లు చెబుతున్నారు. పార్టీ వ్య‌తిరేకులు, పార్టీ ద్రోహం చేసేవారు ఉండ‌టానికి వీల్లేదని ఆమె చెప్పిన‌ట్లు తెలుస్తోంది… ప‌ర్య‌వ‌సాన‌మే మ‌ల్ల‌న్న కాంగ్రెస్ పార్టీ బ‌హిష్క‌ర‌ణ‌.

Get real time updates directly on you device, subscribe now.

You might also like