పోలీస్ స్కూల్ దేశానికి రోల్ మాడల్‌గా ఉండాలి
Revanth Reddy: సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. తెలంగాణలో పోలీసు కుటుంబాల పిల్లల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(Young India Police School) వెబ్‌సైట్ https://yipschool.in ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిషన్లలో పోలీసు అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్ విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్‌తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్ నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబర్ 21న ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.