పోస్టుమెన్‌పై ఎంపీడీవో ఆగ్రహం
లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ ఎందుకు సక్రమంగా చేయడం లేదంటూ MPDO శ్రీనివాస్ పోస్టుమెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌లో నూతనంగా రోడ్లు వేస్తున్నారు. ఈ పనులను పరిశీలించేందుకు ఎంపీడీవో మాదారం టౌన్‌షిప్‌కు వచ్చారు. ఆ పనులను చూస్తుండగా పోస్టుమెన్ ఇంటి దగ్గర పలువురు పెన్షన్ కోసం వేచి ఉండటం చూసి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తమకు పెన్షన్ ఇస్తానని పోస్టుమెన్ చెప్పడంతో ఉదయం 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో ఇదే పరిస్థితి నెలకొంటొందని చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు. పోస్టాఫీస్ వెళ్లి పోస్టుమెన్ ఫారూక్‌ను నిలదీశారు. ఇక ముందు ఇలాంటిది జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.