సిండికేట్ ట్యాక్స్‌..

-కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అధిక ధ‌ర‌ల‌కు మ‌ద్యం
-ఫుల్ బాటిల్‌కు రూ. 40, బీర్ బాటిళ్ల‌పై అద‌నంగా రూ. 20 వ‌సూలు
-కండ్లు మూసుకున్న ఆబ్కారీ శాఖ అధికారులు
-ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న మ‌ద్యం ప్రియులు

Komuram Bhim Asifabad District: అక్క‌డ ఎంఆర్‌పీ ధ‌ర అంటే ఎంటో తెలియ‌దు.. వాళ్లు అమ్మిందే ధ‌ర‌… ఇదేంద‌ని ప్ర‌శ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటరు.. ఎందుకంటే అధికారులు కూడా కండ్లు మూసుకుని ఉంట‌రు కాబ‌ట్టి.. మ‌ద్యం సిండికేట్‌గా మారి ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్ముకున్నా ప‌ట్టించుకునే నాథుడు లేడు.. అడిగే అధికారి లేడు.. మ‌రి ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్న‌ట్లు.. ప‌ట్టించుకోవాల్సిన వారు ఎందుకు నిద్ర‌పోతున్న‌ట్లు… ’నాంది న్యూస్’ ప్ర‌త్యేక క‌థ‌నం..

మ‌ద్యం షాపు నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఇష్టమొచ్చినట్లు ఎంఆర్పీ ధ‌ర‌ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా ఎక్సైజ్ అధికారులు కిమ్మనడం లేదు. కనీసం అటువైపు చూడడమే లేదు. మ‌ద్యం వ్యాపారుల‌కు అధికార పార్టీ అండ‌దండ‌లు ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. లిక్క‌రు విష‌యానికి వ‌స్తే ఒక్కో ఫుల్‌బాటిల్ మీద రూ. 40 అద‌నంగా బాదుతున్నారు. ఇక బీర్ బాటిళ్ల‌పై కూడా అద‌నంగా రూ. 20 వ‌సూలు చేస్తున్నారు. ఎవ‌ర‌న్నా ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే.. దిక్కున్న‌చోటు చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారు. మరికొన్ని చోట్ల‌ బీరు చల్లగా లేదని, అడిగిన బ్రాండ్ తమ వద్ద లేదంటూ మద్యం విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో మందుబాబులు చేసేదేమీ లేక షాపు వాళ్లు ఎంత అడిగితే అంత ఇచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

అధికారులు ఏం చేస్తున్నారు..
ఈ వ్య‌వ‌హారంలో అధికారులు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్‌, వాంకిడిలో విచ్చ‌ల‌విడిగా రేట్ల‌తో మ‌ద్యం అమ్మ‌కాలు సాగుతుంటే ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారులు అటువైపుగా దృష్టి పెట్ట‌డం లేదు. కొన్నిమార్లు అధికారుల దృష్టికి వెళ్లినా ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అధికార పార్టీ నేత‌ల ఒత్తిళ్లా..? లేక సిండికేట్ రాయుళ్లు అధికారుల నోళ్లు మూయిస్తున్నారా..? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఏయే బ్రాండ్లను ఎంత అధికంగా విక్రయించాలి. గ్రామాల్లో నడిచే బెల్టు షాపుల నిర్వాహకులకు ఎంతకు అమ్మాలి అన్నది ఇక్క‌డ ముందే ప్లాన్ ప్ర‌కారం న‌డుస్తోంది. ఈ వ్య‌వ‌హారాన్ని జిల్లాలో వైన్ షాప్ నిర్వాహకులు ముందే డిసైడ్ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడకు వెళ్లినా అంతే ధర చెప్పేలా ప్లాన్ చేసుకుని దందా చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like