భారీగా న‌కిలీ విత్త‌నాలు సీజ్

-247 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
-ఐదుగురు కొనుగోలుదారులు , ముగ్గురు డ్రైవర్ల అరెస్టు
-పరారీలో సూత్రధారి, గ‌తంలోనూ ప‌లు కేసులు
-నిందితుల వివరాలను వెల్లడించిన మంచిర్యాల డీసీపీ

Fake Seeds Seized: న‌కిలీ విత్త‌నాలు ఇష్టారాజ్యంగా అమ్మ‌కాలు సాగ‌తున్నాయి. వ‌రుస‌గా పోలీసుల‌కు ఇవి ప‌ట్టుప‌డుతుండ‌ట‌మే సాక్ష్యం. తాజాగా మంచిర్యాల జిల్లాలో పోలీసులు భారీగా న‌కిలీ విత్నాలు సీజ్ చేశారు. వాటికి సంబంధించిన వివ‌రాల‌ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ (Mancherial DCP Bhaskar) వెల్ల‌డించారు.

మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం అచ్చలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో సన్యాసి మఠం వద్ద డీసీఎం వ్యాన్ లో నుంచి కారులో నకిలీ పత్తి విత్తనాలను డంపు చేస్తుండ‌గా, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా 247 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో అచ్చ‌లాపూర్‌కి చెందిన ఐదుగురు కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రవాణా సరఫరా చేస్తున్న ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని వెల్ల‌డించారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మే ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌లో రూ. 6.17 ల‌క్ష‌ల విలువైన 247 కిలోల విత్త‌నాలు స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు. ఇందులో ప్ర‌ధాన సూత్ర‌ధారి మ‌నోహ‌ర్‌రెడ్డి, మల్లేష్ అనే వ్య‌క్తులు పరారీలో ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఇందులో సెగ్గం సందీప్‌, గాడిపల్లీ సత్యనారాయణ, బొగే సాయి కిరణ్ కుమార్, మైదం నారాయణ, పొట్లపల్లి రమేష్, కుంచె వెంకటేష్, కోడిపెల్లి సత్యం, పుప్పాల‌ తిరుపతిని అరెస్టు చేసిన‌ట్లు డీసీపీ ఏ.భాస్కర్ స్ప‌ష్టం చేశారు.

డీసీఎం వ్యాన్ (TG 19T 1362), టాటా కారు (TS 19D 0982) సైతం పోలీసు స్టేష‌న్ త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించారు. నకిలీ పత్తి విత్తనాలతో భూమి సారం కోల్పోతుంద‌న్నారు. దీంతో పంట దిగుబడి తగ్గే అవకాశాలున్నాయన్నారు. పర్యావరణంపై కూడా ప్రభావం చూసే అవకాశం ఉందన్నారు. గ్లైపోసెట్ విత్తనాలు వాడటం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయ‌ని చెప్పారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే పత్తి విత్తనాలను వాడాలని కోరారు. లైసెన్సు అనుమతి పొందిన ఫెర్టిలైజర్ దుకాణాల్లో మందులను తీసుకొని రసీదు తప్పకుండా తీసుకోవాలన్నారు. దళారుల మాయమాటలు నమ్మి ఈ నకిలీ విత్తనాల బారి నుండి మోసపోవ‌ద్ద‌న్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గానీ, అమ్ముతున్నట్లు గానీ సమాచారం తెలిస్తే త‌మ‌కు చెప్పాల‌ని ఆయ‌న కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామ‌ని డీసీపీ భాస్క‌ర్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్సైలు కిరణ్ కుమార్, సౌజ‌న్య ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like