మహారాష్ట్ర నిందితుడు.. మంచిర్యాలలో అరెస్టు
Prashant Koratkar:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్టు చేశారు. మంచిర్యాలకు వచ్చిన మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ్‌పూర్‌కు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ ను తెలంగాణలోని మంచిర్యాలలో అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.
కొల్హాపూర్‌కు చెందిన చరిత్రకారుడు ఇంద్రజీత్ సావంత్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్ కోరట్కర్‌పై కేసు నమోదైంది. ఇంద్రజీత్ సావంత్‌ను బెదిరించి, మరాఠా రాజుపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఫిబ్రవరి 26న కేసు నమోదు చేశారు. జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ తనకు ఫోన్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు సమాజంలో శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రశాంత్ కోరట్కర్ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. తన ఫోన్ హ్యాక్ చేశారని పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఆడియో నకిలీది అని స్పష్టం చేశారు. ఇది నా పై కావాలనే పన్నిన కుట్ర అని అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కోరట్కర్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కొందరు జర్నలిస్టులు మాత్రం ఇది మీడియాపై దాడి అంటూ ప్రశాంత్ కోరట్కర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మహారాష్ట్ర పోలీసులు కోరట్కర్‌ను విచారించనున్నారు.
కోరాట్కర్‌ను పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చిన 24 గంటల్లోనే అతన్ని అరెస్టు చేయడం గమనార్హం. “పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.. అతను ఎక్కడ ఉన్నా, అది దుబాయ్ లేదా మరెక్కడైనా అతనిపై చర్యలు తీసుకుంటార”ని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.