మహిళలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి
సమాజంలో మహిళలు వారికి ఉన్న హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో భేటి బచావో- భేటి పడావో, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం వలన మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్, 14416ను సంప్రదించాలని తెలిపారు. పని ప్రదేశాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, లోకల్ కంప్లయింట్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఫిర్యాదు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులు భద్రతా వాతావరణంలో పని చేసే విధంగా చట్టాలు తోడ్పడతాయని స్పష్టం చేశారు.
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ మాట్లాడుతూ మహిళల కోసం మానసిక సమస్యలు, న్యాయ హక్కులకు సంబంధించి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ వంటి కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి విషయమని అన్నారు. మానసిక ఒత్తిడి, ఉపశమనాలకు సంబంధించి ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టాలపై పెంపొందించుకున్న అవగాహన మరింత మందికి తెలియజేయాలని స్పష్టం చేశారు. సురక్షితమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. మార్పు ప్రతి ఒక్కరి నుంచి మొదలవ్వాలని తెలిపారు. మానసిక వైద్య నిపుణులు డా. సునీల్ మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ అనిత, పి.ఓ.ఎన్.సి.డి. డాక్టర్ ప్రసాద్, మోటివేషనల్ స్పీకర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.