పేదోళ్ల ఇంట ప్రతి రోజూ పండగ
డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం దేశచరిత్రలో చారిత్రాత్మకమని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంగళవారం పాత మంచిర్యాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని, పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామనీ వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని స్పష్టం చేశారు.