స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు శంకర్

•చేతులు, కాళ్ళకు గాయాలు... ఆసుపత్రిలో చికిత్స
•మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందిపడ్డాడు.. మార్క్ శంకర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటనను ముగించుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు. పవన్ మాత్రం.. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన’ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని చెప్పారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం తల్లి అన్నా లేజ్‌నేవాతో కలిసి సింగపూర్‌లో ఉన్నారు. తల్లి అన్నా లేజ్‌నేవా 2024లో సింగపూర్‌లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్స్ డిగ్రీ (MA) పూర్తిచేశారు. దీంతో శంకర్ పవనోవిచ్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నారు. పవన్ సతీమణి అన్నా లేజ్‌నేవా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు.. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్‌లో ఉన్నారు. అయితే ఆ తర్వాత చదువు కోసం సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like