ఐసీడీఎస్ అధికారుల మొద్దు నిద్ర
.అంగన్‌వాడీ ఆయాలుగా 11 మంది అక్రమ నియామకం
.వారికే నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు
.వెలుగులోకి రావడంతో వారి జీతాల నిలిపివేత
.కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కొనసాగిన వైనం
.పదమూడు ఏండ్లుగా పట్టించుకోని అధికారులు
.ఇప్పుడు అక్రమాన్ని సక్రమం చేసేలా చర్యలు
.ఓ నాయకురాలి నిర్వాకంతో ఇబ్బందులు
అక్రమంగా నియామకాలు జరిగాయి… అవన్నీ వెలుగులోకి వచ్చాయి… వారిని విధులకు రావొద్దని చెప్పారు. అక్రమంగా విధుల్లోకి వచ్చిన వారు కోర్టుకు వెళ్లారు. స్టే తెచ్చుకున్నారు.. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుని ఆ స్టే వెకేట్ చేయించాలి. కానీ పదమూడేండ్లుగా కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా ఇప్పుడు ఆ అక్రమాన్ని సక్రమం చేయాలని చూస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఆ శాఖలో ఉన్నన్ని అక్రమాలు వేరే ఎక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. మంచిర్యాల లక్ష్సెట్టిపేట ప్రాజెక్టులో కొనసాగుతున్న సమయంలో ఇక్కడ పనిచేసిన సీడీపీవో, కార్యాలయంలో పనిచేస్తున్న మరో వ్యక్తి కలిసి అక్రమాలకు తెర లేపారు. వీరికి ఓ నాయకురాలు సైతం తోడయ్యింది. దీంతో దాదాపు 11 మందిని అంగన్‌వాడీలో ఆయాలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇదంతా ఉన్నతాధికారులకు తెలియకుండానే జరిగింది. వాస్తవానికి వారి నియామక పత్రాలు కలెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కలెక్టర్ అనుమతి లేకుండానే ఈ వ్యవహారం అంతా సాగింది.
వాళ్లే ప్రమోషన్లు ఇచ్చుకున్నారు..
వారిని ఆయాలుగా నియామకం చేసిన ఆ సీడీపీవో ఆరు నెలల్లోనే వారికి టీచర్లుగా ప్రమోషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఉన్నతాధికారులకు తెలియకుండానే జరిగింది. అయితే, ఒకరి సర్వేలోకి మరొకరు ప్రవేశించడంతో అంగన్వాడీ టీచర్ల మధ్య గొడవలు జరిగాయి. దీంతో వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటికే వారికి రెగ్యులర్‌గా జీతాలు చెల్లిస్తుండటంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. ఈ నేపథ్యంలో అధికారులు వారిని విధుల్లో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వారి వెనక ఉన్న ఆ నాయకురాలు, అధికారి, కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి కలిసి వారిని కోర్టుకు వెళ్లాలని ప్రోత్సహించారు. దీంతో ఆ పన్నెండు మంది కోర్టుకు వెళ్లారు.
13 ఏండ్లుగా పట్టించుకోవడం లేదు..
వారికి కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత పన్నెండు మంది ఇప్పుడు విధులకు హాజరు కావడం లేదు. అధికారులు కోర్టును సంప్రదించి ఆ పన్నెండు మంది అక్రమ నియమాకాల విషయంలో కేసు కొట్టి వేయించాల్సి ఉంది. పదమూడు సంవత్సరాలు గడిచినా కనీసం ఆ వ్యవహారం పట్టించుకోకపోవడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, కొత్తగా వాళ్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగన్‌వాడీ నాయకురాలు తిరిగి ప్రయత్నిస్తున్నారు. దానికి ఓ అధికారి కూడా సహకరించేందుకు సిద్ధమయినట్లు సమాచారం.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుని కోర్టు వ్యవహారంలో చర్యలు తీసుకుని స్టే వెకెట్ చేయించాలని పలువురు కోరుతున్నారు. లేకపోతే రెండు, మూడు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఐసీడీఎస్‌లో పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పుడు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. మరి అధికారులు ఆ వైపుగా చర్యలు తీసుకుంటారో..? లేదో వేచి చూడాల్సి ఉంది..
ఈ వ్యవహారంపై మంచిర్యాల సీడీపీవో విజయలక్ష్మిని వివరణ కోరగా.. కోర్టు కేసులు క్లియర్ చేయించేందుకు త్వరలోనే హైకోర్టులో పీపీని కలిసేందుకు వెళ్తున్నామన్నారు. కోర్టు కేసులు ఎలా ఉన్నప్పటికీ మంచిర్యాల ప్రాజెక్టులో కొత్త రోస్టర్ కోసం పై అధికారులకు ఫైల్ పెట్టామని ఆమె స్పష్టం చేశారు.