కూలీల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాలి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద‌ ఉపాధి కూలీలకు 100 రోజులు ఖ‌చ్చితంగా పని కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోయవాగులో ఉపాధి హామీ పథకం కింద‌ జరుగుతున్న ఫారం పాండ్ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులను చేపడుతున్న‌ట్లు చెప్పారు.

వేసవికాలం దృష్ట్యా అధిక ఉష్ణోగ్రత సమయంలో ఉదయం, సాయంత్రం వేళలలో పనులు చేపట్టాలని, పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు తాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు కల్పించాలని స్ప‌ష్టం చేశారు. అత్యవసర వైద్యసేవల నిమిత్తం ప్రథ‌మ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి కూలీలకు వేతన చెల్లింపులు సకాలంలో చేయాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అవకాశం కల్పించిన‌ట్లు వెల్ల‌డించారు. జిల్లాలోని అర్హత గల అభ్యర్థులు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం చింతగూడ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న నర్సరీ పనులను పరిశీలించారు. వేసవికాలం అయినందున సకాలంలో మొక్కలకు నీటిని అందించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like