వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేసిన ఆయన రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. రామయ్య సేవలకు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
ప్రముఖుల సంతాపం..
రామయ్య మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao) సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు. రామయ్య మృతికి సంతాపం తెలుపుతూ సీఎంవో నుంచి ప్రకటన విడుదల చేశారు. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటని.. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రామయ్య కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.