మాదారంలో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి..
రూ. 23.70 లక్షలతో కొత్త మోటార్లు తెప్పించిన సింగరేణి
వాటిని బిగించే వీలు లేక గోలేటీకి తరలింపు
అధికారుల నిర్లక్ష్యంతో తీరని మంచినీటి సమస్య
జాడ పత్తా లేని కాంగ్రెస్ పార్టీ నేతలు
నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మాదారం టౌన్షిప్లో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త మోటార్లు వచ్చాయి.. సమస్య పరిష్కారం అయ్యిందనుకునే లోపే అసలు మోటార్లు ఇక్కడ బిగించే వెసులుబాటు లేకపోవడంతో తిరిగి వాటిని గోలేటీకి తరలించారు. దీంతో మాదారంలో నీటి సమస్య రెడ్డచ్చే మొదలాడు అన్న సామెత చందంగా మారింది…
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో నాలుగైదు నెలలుగా మంచినీటి సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ నేతల పట్టింపులేని తనం వల్ల సింగరేణి సరఫరా చేస్తున్న నీటి విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మోటార్లు తరచూ కాలిపోతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నిత్యం బోర్ పంపుల వద్ద జనం క్యూలు కడుతున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు మోటార్లు కాలిపోయాయి. అయినా నిర్లక్ష్యం అలాగే కొనసాగుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలు అటువైపుగా దృష్టి సారించడం లేదు.
కొత్త మోటార్లు వచ్చినా… ఫలితం సున్నా..
మాదారం టౌన్షిప్లో తరచూ నీటి సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో అధికారులు కొత్త మోటార్లు తెప్పించారు. రూ. 23.70 లక్షలతో వీటిని తెప్పించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడ ఉన్న పంపులకు తెచ్చిన మోటార్లకు మధ్య కేసింగ్ తేడా రావడంతో అవి ఇక్కడ బిగించే పరిస్థితి లేకుండా పోయింది. మరి అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని లక్షలు పెట్టి మోటార్లు తీసుకువచ్చే సమయంలో కనీసం వాటి గురించి పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కనపడని అధికార పార్టీ నాయకులు..
మంచి నీళ్ల కోసం జనం నానా ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు కనీసం పట్టించుకోకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాం సమస్య పరిష్కారం అవుతుందని దాదాపు 15 రోజులుగా చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ నేతలు అటు వైపుగా దృష్టి సారించడం లేదు. నీటి ఎద్దడి నేపథ్యంలో మాదారం టౌన్షిప్కు సింగరేణి వాటర్ ట్యాంకర్లు సరఫరా చేస్తోంది. అది కూడా కేవలం కార్మికులు ఉన్న ప్రాంతానికే పరిమితం చేస్తోంది. ఇక, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సైతం నీటిని సరఫరా చేస్తున్నా కొందరు నేతలు తమ ఇండ్లలో నింపిన తర్వాతే వాటిని ప్రజల కోసం పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.