అభినందించారు… ఆందోళనలో పాల్గొన్నారు..
మాదారం టౌన్‌షిప్‌లో ఐదు నెలలుగా నీటి ఎద్దడి
రెండు కొత్త మోటార్లు తెప్పించిన సింగరేణి యాజమాన్యం
తమ వల్లే సమస్య పరిష్కారం అయిందంటూ ఏఐటీయూసీ ప్రకటనలు
సాంకేతిక సమస్యతో మోటార్లు ఫిట్ చేయకుండానే తరలింపు
అధికారులను పొడిగిన నోటితోనే, ఆందోళనల్లో పాల్గొన్న నేతలు
AITUC: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది… ఈ సామెత బెల్లంపల్లి ఏఐటీయూసీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. సమస్య పరిష్కారం కోసం కనీసం ఉద్యమం చేయలేదు.. ప్రజల తరఫున పోరాటం చేయలేదు… కానీ, అధికారులను పొగడంలో మిగతా యూనియన్ నాయకులు ముందుండి ఇప్పుడు తీరిగ్గా నాలుకకరుచుకుంటున్నారు… ఇంతకీ ఏం జరిగిందంటే.. బెల్లంపల్లి ఏరియాలోని మాదారం టౌన్‌షిప్‌లో నాలుగైదు నెలలుగా మంచినీటి సమస్య నెలకొంది. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అటు కార్మికులు, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం మాదారం టౌన్షిప్‌కు కొత్త మోటార్లు వచ్చాయి. దీంతో నీటి సమస్య తీరుతుందని అంతా భావించారు. కానీ, అటు మోటార్లు ఇటు కేసింగ్‌ల మధ్య తేడా రావడంతో ఆ మోటార్లు ఇక్కడ పనికి రాకుండా పోయాయి. దీంతో వాటిని సింగరేణి యాజమాన్యం గోలేటీ టౌన్షిప్‌కు తరలించింది. ఇదంతా జరుగుతుండగానే బెల్లంపల్లి ఏరియా ఏఐటీయూసీ నేతలు తమ వల్లే నీటి సమస్య పరిష్కారం అయ్యిందని, తమ కృషి వల్లనే రూ. 23.70 లక్షలతో మోటార్లు తెప్పించారని చెప్పుకున్నారు. ఏఐటీయూసీ గోలేటీ బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, శేషు, జగ్గయ్య, సముద్రాల ఆనంద్, జూపాక రాజేష్, మారం శ్రీనివాస్ బెల్లంపల్లి జీఎం, సివిల్ డీజీఎం భాషాకు కృతజ్ఞతలు చెప్పారు.
అయితే, కొత్త మోటార్లు బిగించకుండానే వాటిని తరలించడంతో ఖంగుతినడం ఏఐటీయూసీ నేతల వంతైంది. మరోవైపు బుధవారం మాదారం టౌన్షిప్‌లోని ప్రజలు పెద్ద ఎత్తున గోలేటీ, ఖైరిగూడ రోడ్డుపై భారీగా ధర్నా నిర్వహించారు. నీటి ఎద్దడి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఏఐటీయూసీ నేతలు సైతం పాల్గొన్నారు. ముందుగా అధికారులను పొగుడుతూ ప్రకటనలు విడుదల చేయడం ఎందుకు..? ఆందోళనలో పాల్గొనడం ఎందుకని…? పలువురు ప్రశ్నిస్తున్నారు. సమస్య పరిష్కారం అయితే ఖచ్చితంగా అధికారులకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే.. కానీ కాక ముందే తొందరపడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిత్యం బూర్జూవా పార్టీలు అని పిలిచే మిగతా పార్టీలు, యూనియన్ల కంటే ముందే తాము ఉండాలనే తపనతో ఇలా చేయడం సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.