రూ. లక్ష దాటిన తులం బంగారం
Gold Price : తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు దాటింది. సోమవారం సాయంత్రానికి బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి రోజురోజుకు వందలు, వేలలో పెరుగుతూ వచ్చిన బంగారం ఇవాళ లక్ష రూపాయల మార్కును దాటింది.
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా బంగారానికి రెక్కలొచ్చాయి. బంగారంపై పెట్టుబడే సురక్షితమని అందరూ నమ్ముతుండటంతో ఇటీవల కాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇలా రోజురోజుకు పెరుగుతూవచ్చిన గోల్డ్ ఇవాళ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. సోమవారం సాయంత్రానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,016 కు చేరుకుంది. కొన్ని నగరాల్లో ఇప్పటికే తులం బంగారం లక్షకు చేరితే మరికొన్నినగరాల్లో రేపు ఈ మార్క్ దాటే అవకాశం ఉంది.
ప్రస్తుతం భౌతిక మార్కెట్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 96,590గా ఉంది. దీనికి 3 శాతం జీఎస్టీ కలిపితే దాదాపు రూ. 99,488 అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతుండటంతో దేశీయంగానూ అదే పరిస్థితి నెలకొంది. లైవ్ మార్కెట్లో ఒక దశలో తులం గోల్డ్ రేటు రూ. లక్షను తాకి కాస్త వెనక్కి మళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగువనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం 98,350 గా ఉంది. మరో రూ.1,650 పెరిగితే ఇక్కడ కూడా లక్ష రూపాయలకు టచ్ అవుతుంది. ఒకటిరెండు రోజుల్లో హైదరాబాద్ లో కూడా బంగారం లక్ష రూపాయల మార్కును దాటడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
అయితే లక్ష రూపాయలతో బంగారం ధర ఆగిపోదని… మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది… కాబట్టి బంగారానికి అధిక డిమాండ్ ఉంది. ధర ఎంత పెరిగినా బంగారం కొనేవారు మాత్రం తగ్గడంలేదు. అక్షయ తృతీయ దగ్గర పడుతోంది. ఈరోజు కనీసం గ్రాము బంగారమైనా కొనాలని చాలామంది నమ్ముతారు. ఇలా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధర ఇదే స్థాయిలో పెరుగుతూ పోతుంటే తులం ధర రూ.1,30,000 ఈ ఏడాదిలోనే చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం అంటేనే నోరెళ్లబెడుతున్న సామాన్యులు ఏడాది చివర్లో బంగారం ధరను చూసి ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తంగా బంగారం అనేది ధనవంతుల వస్తువుగా మారిపోతోంది… పేదవాడు ఆ పేరు ఎత్తే పరిస్థితులు మెళ్లిగా దూరమవుతున్నాయి.
చైనా కొనుగోళ్లు బంగారం డిమాండ్ పెంచుతున్నాయి.. చైనా సెంట్రల్ బ్యాంక్ కొన్ని నెలలుగా డాలర్లకు బదులుగా బంగారం నిల్వలను పెంచుతోంది. ఇది బంగారం డిమాండ్‌ను పెంచుతోంది. దీనికి అమెరికా వాణిజ్య విధానాలు సైతం తోడవుతున్నాయి. అమెరికా, చైనాపై మరిన్ని టారిఫ్‌లు విధిస్తే ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి కోసం బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక, డాలర్ విలువ క్షీణత సైతం ఇందుకు కలిసి వస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్ విలువ తగ్గుతుంది. దీనివల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్-ఇరాన్, ఉక్రెయిన్-రష్యా వంటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు బంగారం ధరలకు సానుకూలంగా మారుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన ఆప్షన్‌గా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.