మాదారం మోటారు మళ్లీ కాలిపోయింది
Madaram Town Ship: ఏదైనా సమస్య ఎదురైతే… దానిపై చిత్తశుద్ధి లేకపోతే ఇలాగే ఉంటుంది.. సమస్య ఎదురైనప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం తిరిగి అది సమస్యలాగే ఉండటం.. ప్రజలకు ఇబ్బందులు కొనసాగడం.. ఇదీ నిత్యం కొనసాగుతున్న తంతు.. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌లో నీటి కోసం ప్రజలు నాలుగైదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇరవై రోజులుగా తిప్పలు తప్పడం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలు తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి..
బెల్లంపల్లి ఏరియాలోని మాదారం టౌన్షిప్‌లో తరచూ మంచినీటి సమస్య తలెత్తుతోంది. ఈ మధ్య కాలంలోనే దాదాపు ఐదుసార్లు మోటార్లు కాలిపోయాయంటే పరిస్తితి అర్థం చేసుకోవచ్చు. మోటార్లు కాలిపోవడం అధికారులు వాటికి మరమత్తులు చేయించడం, నాలుగైదు రోజుల్లోనే మళ్లీ అవి కాలిపోవడం జరుగుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు కనీసం అటు వైపుగా తలెత్తిచూడటం లేదు. దీంతో మోటార్లు కాలిపోవడం తలలు పట్టుకోవడం ప్రజల వంతు అవుతోంది. దీంతో నిత్యం బోర్ పంపుల వద్ద జనం క్యూలు కడుతున్నారు.
తరచూ మోటార్లు ఎందుకు కాలుతున్నాయి..
మాదారం టౌన్షిప్‌కు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులు మోటారు నిరంతరం నడిపిస్తున్నారు. దీంతో దానిపై ఒత్తిడి పెరిగి అది కాలిపోతోంది. తిరిగి దానిని సరిచేయించుకుని వచ్చి మళ్లీ నడిపిస్తున్నారు. మళ్లీ కాలిపోతోంది. ఒకే దానిపై ఒత్తిడి పడకుండా మరో మోటారు తెచ్చి రెండింటిని నడిపిస్తే పని సక్రమంగా నడుస్తుంది. ఎక్కడైనా అదనంగా ఉన్న పంపును తెప్పించి సమస్య పరిష్కారం అయిన తర్వాత తిరిగి దానిని పంపించవచ్చు. కానీ, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మోటారు కాలిపోవడం దానిని రిపేర్లకు పంపించడం ఇలా లక్షల్లో ధనం వృథా అవుతోంది.
మిషన్ భగీరథకు లైన్ కలిపినా..?
సింగరేణి అధికారులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఈ నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కొద్ది రోజుల కిందట ఓ నిర్ణయం తీసుకున్నారు. మిషన్ భగీరథ ట్యాంక్‌కు సింగరేణి పైప్‌లైన్ కలిపారు. నాలుగు రోజుల కిందట ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు. అయితే, ఇక్కడ కూడా అధికారులు చిన్న తప్పింద చేశారు. సింగరేణి ఫిల్టర్‌బెడ్‌కు కలపాల్సిన లైన్ నేరుగా టౌన్షిప్‌కు సరఫరా చేసే లైన్‌కు కలిపారు. దీంతో మిషన్ భగీరథ ద్వారా మాదారం టౌన్‌షిప్‌కు నీళ్లను ఇచ్చినా అవి మురికిగా ఉండటంతో తాగడానికి పనికి రాకుండా పోయాయి. ఇలా అధికారులు ఏ పని చేసినా అవి పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. మరోవైపు టౌన్‌షిప్ అంతటికీ ఈ నీళ్లు సరిపోతాయా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కొత్త మోటార్లు వచ్చే వరకు సమస్య అలాగేనా..?
ఇక్కడ తరచూ నీటి సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో అధికారులు కొత్త మోటార్లు తెప్పించారు. రూ. 23.70 లక్షలతో వీటిని తెప్పించినా, మోటార్లకు ఇక్కడ ఉన్న పంపులకు మధ్య కేసింగ్ తేడా రావడంతో అవి ఇక్కడ బిగించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని వెనక్కి పంపించారు. మళ్లీ అవి వచ్చే వరకు దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ కొత్త మోటార్లు వచ్చే వరకు నీటి సమస్య ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. అప్పటికి ఎండాకాలం కాస్తా పూర్తవుతుంది. అప్పటి వరకు మాదారం టౌన్షిప్ ప్రజల నీటి కష్టాలు తీరేలా కనిపించడం లేదు.