చిక్కినట్టే చిక్కి త‌ప్పించుకున్న ఉగ్ర‌వాదులు

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి మార‌ణ‌హోమం సృష్టించిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు నాలుగు సార్లు చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుని పారిపోయారు. ఓసారి భారత బలగాలపై ఎదురు కాల్పులు సైతం చేశారు. అయినా భారత బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారి కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాయి.

దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు విపరీతంగా కష్ట పడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఇంటిలిజెన్స్ నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తూ.. పట్టుకునేందుకు వెళ్లగా క్షణాల్లో తప్పించుకుంటున్నారు. అడవులు చిక్కగా ఉండడం, కనిపించే వాళ్లు ఉగ్రవాదులేనా కాదా అని ధ్రువీకరించుకోవాల్సి ఉండగా.. భద్రతా బలగాలు కాస్త సమయం తీసుకోవాల్సి వస్తోంది. కానీ ఉగ్రవాదులు మాత్రం అలికిడి వస్తే చాలు కాల్పులు జరుపుతూ క్షణాల్లో జారుకుంటున్నారు.

ముందుగానే గుర్తిస్తున్నారు..
భద్రతా బలగాలు ఉగ్రవాదులను పహల్గాం తెహస్లీ వద్ద మొద‌టి సారి ట్రాక్ చేశారు. కానీ వీరు అక్కడకు వెళ్లేలోపే వారు మళ్లీ అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలికలు కనిపించగా.. భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ముందుగానే విషయం గుర్తించిన ముష్కరులు.. అధికారులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత త్రాల్ కొండల్లో ఉగ్రవాదులు నక్కినట్లు గుర్తించగా.. అక్కడికి చేరుకునేలోపే కొకెర్నాగ్ లొకేషన్‌కు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం వీరంతా ఆ ప్రాంతం చుట్టుపక్కలే ఉండొచ్చని అధికారలు వెల్లడిస్తున్నారు. ఓ స్థానిక గ్రామంలోని ఇంట్లోకి వారు రాత్రి భోజనానికి వెళ్లగా అక్కడికి దళాలు చేరుకున్నాయి. వారు ఆహారం తీసుకుని పారిపోయారు. అయితే ఈ విషయాన్ని నేరుగా సైనిక అధికారులే వెల్లడించారు.

చైనా ఫోన్లు, అమెరికా ఆయుధాలు…
పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన టెర్రరిస్టులు కఠిన శిక్షణ పొందినవారుగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. వీరి వద్ద ఎన్ క్రిప్టెడ్ సాధనాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. వీటిలో సందేశాలను క్రాక్ చేయడం దాదాపు అసాధ్యం. దాడి జరిగిన వేళ అక్కడ చైనాకు చెందిన ఓ శాటిలైట్ ఫోన్ ను వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో పాక్ ఉగ్రవాదులు మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సాధనాలు వినియోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయం ఉండటంతో.. పంపేవారు.. రిసీవ్ చేసుకొనేవారు మాత్రమే చూడగలరు. స్థానిక నెట్ వర్క్ లను బైపాస్ చేసేందుకు.. ఇరిడియం, శాటిలైట్ ఫోన్లను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారు.

ఎస్ఎస్ఏ కమాండోలు, పాక్ సైన్యం మాజీ సిబ్బంది
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఎత్తుగడల్లో బలమైన మార్పులు వచ్చాయని సైనికాధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదుల్లో ఎస్ఎస్ఏ కమాండోలు, పాక్ సైన్యం మాజీ సిబ్బంది ఉంటున్నారని స్ప‌ష్టం చేస్తున్నారు. వీరికి జంగిల్, మౌంటేన్ వార్‌ఫేర్‌లో కఠిన శిక్షణ ఇస్తున్నారని వెల్ల‌డిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడా ఎక్కువసేపు ఉండటం లేదు. ఎవరి సాయం తీసుకొన్నా.. ఆ తర్వాత వారితో సంబంధాలు కట్ చేసుకుంటున్నారు. అడవులు, కొండల్లోనే ఉంటున్నారు. అఫ్గానిస్థాన్లో అమెరికా వదిలేసిన ఎం4 రైఫిల్స్ ను వీరికి సమకూరుస్తున్నారు. వీటికి టెలిస్కోపిక్, నైట్ విజన్ ఉంటాయి. సుదూర లక్ష్యాలను కూడా చేదించగలుగుతున్నారని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like