నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోండి
పోలీస్ కమిషనర్, డీసీపీలకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు
బెల్లంపల్లి పట్టణంలో పలువురు నకిలీ విలేకరులు చెలామణి అవుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్ సభ్యులు ఫిర్యాదు చేశారు. నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఉండగా మరో ప్రెస్ క్లబ్ పేరుతో చెలామణి అవుతూ, కొందరు వ్యక్తులు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులోపేర్కొన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలనికోరారు. దీనిపై పోలీస్ కమిషనర్, డీసీపీ స్పందిస్తూ నకిలీ విలేకరులపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విలేకరుల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిని గుర్తించి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.