అంగన్వాడీలకు రేపట్నుంచి వేసవి సెలవులు..
Anganwadi: రాష్ట్రంలోని అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి నెల రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. వేసవి సెలవుల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరకులు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ఈ సెలవుల్లో అంగన్వాడీ టీచర్లను ఇంటింటి సర్వే వంటి విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
అంగన్ వాడీ కేంద్రాలకు వేసవి సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన ఎండల దృష్ట్యా మే 1వ తేదీ నుంచి జూన్ 1 తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. కాగా రాష్ట్రంలోని గర్బిణీలు, బాలింతలు, చిన్నారులకు ఇంటి వద్దకే పోషకాహారం సరఫరా చేయాలని ఆదేశించింది. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోతున్న అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో పాటు పిల్లలకు కూడా ఉపశమనం కలిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని జిల్లాల అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు సెలవులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో అంగన్వాడీలకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.