ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత.. ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవం..
తెలంగాణ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక మిగతా చోట్ల చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవాల హవా కొనసాగింది.. నామినేషన్ ఉప సంహరణ ముగియడంతో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. వరంగల్ ,నిజామాబాద్, మహబుబ్‌నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాల అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం అయ్యింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవాల జోరు కొనసాగింది.. పలువురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో పలు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఏకగ్రీవం అయిన స్థానాల్లో వరంగల్ ,నిజామాబాద్, మహబుబ్‌నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులు ఉన్నారు. వీరంతా ఇప్పటికే ఎన్నికల కమిషన్ చేతుల మీదుగా ఎన్నిక పత్రాలను కూడా తీసుకున్నారు..
ఆదిలాబాద్ జిల్లాలో ఉప సంహరణ సమయంలో నాటకీయ పరిణామాలు చేసుకోవడంతో పాటు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ నామినేషన్‌తో పాటు మరో 23 మంది స్వతంత్రులు నామినేషన్ వేశారు.. 23 మంది అభ్యర్థుల్లో 22 మంది తమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. పుష్పలత అనే అభ్యర్థి కూడా విత్ డ్రా చేసుకుందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. అనుహ్యంగా పుష్పలత ఎన్నికల కార్యాలయానికి వచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తన నామినేషన్ ఉపసంహరించుకోలేదని మీడియా ముందుకు వచ్చి చెప్పింది. తుడుందెబ్బ మద్దతుతో బరిలో నిలిచినట్టు ఆమె చెప్పారు. దీంతో ఆదిలాబాద్‌లో ఇద్దరు సభ్యుల మధ్య పోటి నెలకొని ఉంది.
– ఏకగ్రీవం అయిన జిల్లాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కొటగిరి శ్రీనివాస రావు నామినేషన్ బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు తమకు తెలియకుండా సంతకాలు పెట్టుకున్నారనే ఆరోపణ చేయడతో ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ రద్దు చేశారు. దీంతో ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం అయ్యారు.
-వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వరంగల్ స్థానానికి 13 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో పదిమంది అభ్యర్ధుల నామినేషన్స్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ రద్దు చేశారు. ఇక మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు కూడా తమ నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు.
– మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. జిల్లాలోని రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. దీంతో ఆ జిల్లా నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీలో మిగలడంతో.. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది.
– రంగారెడ్డి జిల్లాలోనూ బరిలో ఎవరూ నిలవకపోవడంతో రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. నామినేషన్ల సమయంలోనే నామినేషన్స్ వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారనే ఆరోపణలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. టీఆర్ఎస్ అభ్యర్ధులు ఇద్దరు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి పోటీలో నిలిచారు. వీరి ఎన్నికను నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించారు.