మావోయిస్టుల‌పై ఘ‌నవిజ‌యం సాధించాం

-ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంట‌ర్‌పై స్పందించిన‌ ప్ర‌ధాని, అమిత్‌షా
-భద్రతా బలగాల విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
-2026 మార్చి 31 నాటికి నక్సలిజం అంతం చేస్తామన్న అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు సైతం మరణించారు. నంబాళ్ల కేశవరావు మృతిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఓ మైలురాయి విజయం సాధించామన్నారు. ఈ ఆపరేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భద్రతా బలగాల సాహసోపేతంగా వ్యవహరించాయంటూ కొనియాడారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) కూడా మరణించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇది నక్సలిజం నిర్మూలనలో ఒక మైలురాయి వంటి విజయమని అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని అమిత్ షా తన పోస్టులో పేర్కొన్నారు. మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నేతను దళాలు మట్టుబెట్టడం ఇదే తొలిసారని ట్వీట్‌ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ రీపోస్ట్ చేస్తూ భద్రతా బలగాలను ప్రశంసించారు. “మీ అద్భుత విజయాన్ని చూసి గర్వపడుతున్నాను. మావోయిజం ముప్పును పూర్తిగా తొలగించి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ప్రధాని తన సందేశంలో తెలిపారు.

మాధ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ కూంబింగ్‌లో బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బలగాలు పాల్గొన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like