కాంగ్రెసోళ్లే బాంబులు పెట్టి పేల్చారేమో..?
KTR: కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి.. నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో.. మరొకటో పెట్టి ఉంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పనిచేసే వాళ్లు ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో నిర్మల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చేశారని నా అనుమానం. పాలమూరులాగే కాళేశ్వరంలోనూ నిజం తెలుస్తుందన్నారు. వరంగల్ మహాసభ విజయవంతం కాగానే నోటీసుల డ్రామా మొదలుపెట్టారు. కాళేశ్వరం ఒక ఇంజినీరింగ్ మార్వెల్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అందాల పోటీలు రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకు మధ్య జరుగుతున్నట్టు ఉన్నాయి. మిస్ వరల్డ్ బ్యానర్ల మీద రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు చూశా.. వారిలో ఎవరు మిస్ వరల్డ్ పోటీదారులో అర్థం కాలేదంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ.. బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన అద్భుత కట్టడాలను అందగత్తెలకు చూపించారు. లక్షన్నర కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలు పడ్తలేవు.. కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం నెల నెలా టకీ టకీమని పడుతున్నాయన్నారు కేటీఆర్.