ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి
కలెక్టర్ కుమార్ దీపక్
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం భీమారం మండలం పోలంపల్లి, భీమారం, అర్కపల్లి, అంకుసాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల వద్ద నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తమన్నారు. సన్నరకం వడ్లు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు రూ. 500 అదనపు బోనస్ అందిస్తమన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల కోసం తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అవసరమైన గోనెసంచులు, టార్పాలిన్లను సమకూర్చామని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలను మూసివేశామని తెలిపారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇండ్లు అంశాలను పరిశీలించారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా దరఖాస్తుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ పథకం అర్హులకు మాత్రమే వర్తింపచేయాలన్నారు. అనర్హులకు అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. పథకం అమలులో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.