యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే లక్ష్యం

-ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కంపెనీల సహకారంతో ఉద్యోగాల కల్పన
-సింగరేణి సహకారంతో మరిన్ని జాబ్ మేళాలు
-దొరికిన అవకాశాన్ని అందుకొని పై అవకాశాల కోసం ప్రయత్నించాలి
-వైరాలో జాబ్ మేళా ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క
-సింగరేణి 14 నియోజకవర్గాల్లో జాబ్ మేళాల నిర్వహణకు సంసిద్ధం: సీఎండీ బలరామ్

Singareni:తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారని, వారి కలలు నిజం చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వైరా పట్టణంలో సింగరేణి సహకారంతో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ప్రారంభించి ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు కల్పించామని, మరో 30వేల ఉద్యోగాలను కల్పించబోతున్నామన్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో జూన్ 2న నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామనీ చెప్పారు. అదనంగా ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సింగరేణి సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో యువత తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తమ ప్రాంతం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైదన్నారు. ఇందుకు సహకరించిన ఉపముఖ్యమంత్రికి, సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.
సింగరేణి సీఎండీ బలరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సింగరేణి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఒడిశా రాష్ట్రానికి వచ్చి సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీబ్లాక్ ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేశారని స్పష్టం చేశారు. వారి వల్ల సింగరేణి జాతీయ సంస్థగా ఎదిగిందన్నారు. ఆయన ఆదేశం మేరకు సింగరేణి విస్తరించి ఉన్న 14 నియోజకవర్గాల్లో ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించడానికి సంస్థ పూర్తి సహకారం అందించబోతుందని తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామ్ రెడ్డి, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like