కోడిగుడ్లు చిన్న‌గున్న‌య్‌.. వాస‌నొస్తున్న‌య్‌..

మేడం.. మాకు కోడిగుడ్లు వేశారు.. కానీ సైజు చిన్న‌గా ఉన్నాయి.. వెయిట్ త‌క్కువ‌గా ఉన్నాయి… కొన్ని కోడిగుడ్ల‌పై న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్నాయి. వాస‌న కూడా వ‌స్తోంది మేడం.. అంగ‌న్‌వాడీ కోడిగుడ్ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం ఇది.. అది కూడా బ‌య‌ట వాళ్లు ఎవ‌రో ఫిర్యాదు చేసింది కూడా కాదు.. ఒక అంగ‌న్‌వాడీ టీచ‌ర్ త‌మ సూప‌ర్‌వైజ‌ర్‌కు సెల్‌ఫోన్‌లో పెట్టిన పోస్టు అది..

అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా నాసిరకం కోడిగుడ్లు, తక్కువ బరువు ఉన్నవి, నిల్వ అయిన కోడిగుడ్లను సరఫరా జరుగుతోంది. అధికారుల వరకు పర్యవేక్షణ లోపం కారణంగా ఇలా నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయి. గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను నియంత్రించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిబ్బంది వాపోతున్నారు. మంచి పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. అంగన్ వాడీల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారుతోంది.

ఏండ్ల త‌ర‌బ‌డి ఇదే ప‌రిస్థితి..
మంచిర్యాల జిల్లాలో ఈ ప‌రిస్థితి ఎన్నో ఏండ్ల నుంచి కొన‌సాగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో అధికారులు నిత్యం ప‌ర్య‌వేక్షిస్తూ ఏదైనా ఫిర్యాదు వ‌స్తే కంట్రాక్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉండ‌గా, చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హరిస్తుండ‌టం అనుమానాలకు తావిస్తోంది. తక్కువ పరిమాణం కలిగిన గుడ్లు సరఫరా చేస్తూ కాంట్రాక్టర్లు అక్రమాల‌కు పాల్పడుతున్నారు. ఎన్నిసార్లు అటు టీచ‌ర్లు, ఇటు ల‌బ్ధిదారులు ఫిర్యాదు చేసినా అధికారులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతున్నా అవి కేవ‌లం కంటి తుడుపు చ‌ర్య‌లుగానే మిగిలిపోతున్నాయి. గ‌త ఏడాది కోట‌ప‌ల్లి మండలం ఆలుగామ‌, పిన్నారంలో గ‌ర్భిణీల‌కు స‌ర‌ఫరా చేసిన కోడిగుడ్లు వాస‌న రావ‌డంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఏడాది కూడా అదే ప‌రిస్థితి నెల‌కొన్నా ఏ మాత్రం చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇష్టం ఉంటే తీసుకోండి.. లేదంటే లేదు..
అంగన్వాడీల ద్వారా పంపిణీ చేసే కోడిగుడ్లు వాస్తవానికి ఒక్కోటి 50 గ్రాముల బరువు ఉండాలి. అంటే ఒక ట్రేలో ఉండాల్సిన 30 కోడిగుడ్లు 1500 గ్రాముల బరువు ఉండాలి. 16 మిల్లీమీటర్ల డయామీటర్, 3 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలి. కానీ సగటున ఒక్కో గుడ్డు 40 గ్రాములు ఉండగా ట్రే బరువు 1200 గ్రాములు దాటడం లేదు. మ‌రికొన్ని చోట్ల‌నైతే ఏకంగా ఒక్కో గుడ్డు 35 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటున్నాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. మార్కెట్లో అమ్ముడుపోని గుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు తరలించి వాటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని స‌మాచారం. కొన్ని సంద‌ర్భాల్లో టీచ‌ర్లు సైతం గుడ్లు తీసుకునేందుకు నిరాక‌రిస్తే ఇష్టం ఉంటే తీసుకోండి.. లేదంటే లేదు.. అని కంట్రాక్ట‌ర్ చెబుతున్న‌ట్లు టీచ‌ర్లు వాపోతున్నారు.

అధికారుల దృష్టికి ఎన్నిమార్లు వ‌చ్చినా..
ఈ వ్య‌వ‌హారంలో అధికారుల దృష్టికి ఎన్నిమార్లు వ‌చ్చినా క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం వెన‌క అంత‌రార్థం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. కొంద‌రు అధికారులు కంట్రాక్ట‌ర్‌ను కాపాడ‌టానికే కోడిగుడ్లు ఎలా వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లువురు టీచ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్ నాందిన్యూస్‌తో మాట్లాడుతూ కొన్ని చోట్ల గుడ్లు చిన్న‌గా వ‌చ్చిన విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. చిన్న‌గా వ‌చ్చిన చోట కోడిగుడ్లు మార్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like